- దుకాణాలు మూసివేయించిన బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు
- తెరిపించిన పోలీసులు
మెదక్, వెలుగు : ఇరువర్గాల గొడవ, పరస్పర దాడుల నేపథ్యంలో తమ లీడర్ల అరెస్ట్‌ను నిరసిస్తూ బీజేపీ, బీజేవైఎం పిలుపు మేరకు సోమవారం మెదక్ పట్టణంతో పాటు, జిల్లావ్యాప్తంగా బంద్జరిగింది. చాలా చోట్ల స్వచ్ఛందంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోల్‌బంక్‌లు, హోటళ్లు మూసివేశారు. పట్టణంలో అక్కడక్కడా తెరిచిన దుకాణాలు, హోటళ్లను బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు మూసివేయించారు. కాగా, పోలీసులు వచ్చి దుకాణాలు బంద్చేయిస్తున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. మూసిన దుకాణాలను తెరిపించారు.
ఈ సందర్భంగా బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలకు, దుకాణదారులకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఇదిలా ఉండగా రామాయంపేట, చేగుంట, వెల్దుర్తి, నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి, కొల్చారం, చిన్నశంకరంపేట, హవేలి ఘనపూర్ తదితర మండల కేంద్రాల్లోనూ బంద్జరిగింది. ఇక్కడ కూడా బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు తిరుగుతూ దుకాణాలు బంద్ చేయించారు.
మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మెదక్ లో గట్టి పోలీస్‌బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పెషల్‌పార్టీ పోలీసులు పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహించడంతోపాటు, చౌరస్తాలు, ప్రార్థన మందిరాలు, ఎమ్మెల్యే క్యాంప్ఆఫీస్తదితర చోట్ల పికెట్ఏర్పాటు చేశారు.