మెదక్​ ఎంపీపై మస్త్​ బాధ్యతలు

  •     నవోదయ, కేంద్రీయ విద్యాలయాల డిమాండ్​
  •     ఎక్స్​ప్రెస్​ రైళ్ల హాల్టింగ్​
  •     అథ్లెటిక్​ అకాడమీ ఏర్పాటు 
  •     రఘునందన్​రావుపైనే ఆశలన్నీ

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు : మెదక్ ఎంపీగా గెలుపొందిన రఘునందన్​ రావుపై ఉమ్మడి మెదక్ జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎంపీ చొరవ చూపితే ఎన్నోపెండింగ్​ సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నారు. ఎన్నో దశాబ్దాల ఎదురు చూపుల తర్వాత గత బీజేపీ ప్రభుత్వం మెదక్ పట్టణానికి రైల్వే సదుపాయం కల్పించింది. అక్కన్నపేట నుంచి మెదక్ వరకు కొత్త రైల్వే లైన్​ పూర్తయి రైళ్ల రాకపోకలు షురూ అయ్యాయి. ప్రస్తుతం కాచిగూడ మధ్య మాత్రమే ప్యాసింజర్​ రైలు నడుస్తోంది. సికింద్రాబాద్-, ముత్కేడ్​ మార్గంలో తిరుపతి, షిర్డీ వంటి పుణ్యక్షేత్రాలకు

ముంబైకి  వెళ్లే  రైళ్లు మెదక్ స్టేషన్​కు వచ్చి వెళ్లేలా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. మెదక్​ పట్టణంలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్​ స్టేడియంలో ఖేలో ఇండియా పథకం కింద రూ.7 కోట్ల వ్యయంతో సింథటిక్​ ట్రాక్​ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ అథ్లెటిక్​ అకాడమీ లేకపోవడం వల్ల కోట్లు వెచ్చించి సింథటిక్​ ట్రాక్​ నిర్మించినా ఉపయోగం లేకుండాపోయింది. ఇది పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావాలంటే అథ్లెటిక్​ అకాడమీ మంజూరు కావాలి. దీంతోపాటు ఫుట్ బాల్​అకాడమీ, స్పోర్ట్స్​ స్టేడియం పక్కనే ఉన్న ఇండోర్​ స్టేడియంలో ఇండోర్​ గేమ్స్​ కు సంబంధించిన అకాడమీలు అవసరం.

మెదక్ పట్టణంలో కెథడ్రల్​చర్చి, చారిత్రక ఖిల్లా, పాపన్నపేట, కొల్చారం మండలాల సరిహద్దులో ఏడుపాయల, మెదక్​ -కామారెడ్డి జిల్లాల సరిహద్దులో పోచారం వైల్డ్​ లైఫ్​ శాంక్చురీ, హైదరాబాద్​నుంచి మెదక్​ వచ్చే మార్గంలో నర్సాపూర్ అడవి, అర్బన్​ పార్క్​ ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి టూరిజం సర్క్యూట్​ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించి టూరిజం సర్క్యూట్​ ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందడంతోపాటు, ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. దీంతోపాటు కొత్తగా ఏర్పాటైన మెదక్ జిల్లాకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు మంజూరైతే జిల్లా విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు అందుబాటులోకి వస్తాయి.   

సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేట జిల్లాలో  కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభించిన రెండు నేషనల్​హైవే రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట మీదుగా మెదక్ వరకు 120  కిలో మీటర్ల దూరం 765 డీజీ నేషనల్ హై వే పనులు ప్రారంభమై దాదాపు రెండేళ్లు కావస్తోంది. రెండు భాగాలు విభజించి పనులు నిర్వహిస్తున్నా ఆశించిన మేర పనులు స్పీడ్​గా జరగడం లేదు. జనగామ నుంచి సిద్దిపేట మీదుగా సిరిసిల్ల వరకు 365 బీ నేషనల్ హైవే పనులు నత్తనడకనే సాగుతున్నాయి. దాదాపు ఏడాది కింద ప్రారంభమైన పనులు జిల్లాలోని చేర్యాల సబ్ డివిజన్ ను దాటి ముందుకు సాగడం లేదు.

ఇప్పటికే పలు చోట్ల కల్వర్టు పనులు నిలిచిపోగా కొన్ని చోట్ల మాత్రమే రోడ్డు నిర్మాణాలను పూర్తి చేసినా పనులు మాత్రం వేగంగా జరగడం లేదు. గజ్వేల్ రింగ్ రోడ్డు పై రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు చాలా కాలంగా నిలిచిపోయాయి. దీంతో రింగ్ రోడ్డు సగం మాత్రమే అందుబాటులోకి వచ్చింది. గజ్వేల్ పట్టణ సమీపంలోని ఆర్వోబీ పూర్తయింతే రింగ్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వరకు రైల్వే లైన్ పూర్తి కావడంతో గత ఆక్టోబరులో ఒకేఒక రైల్వే సర్వీసును ప్రారంభించారు. సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగుళూరుకు రైల్వే సర్వీసులు ప్రారంభిస్తారని ప్రకటించినా ఇప్పటి వరకు దీనిపై ఎలాంటీ  ప్రగతి లేదు.

సంగారెడ్డి జిల్లాలో..

పటాన్ చెరు, సంగారెడ్డి మీదుగా బుల్లెట్ ట్రైన్ లైన్ చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉంది. ఈ ట్రైన్ పూణే నుంచి మొదలై సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల మీదుగా నడిపించాలనే ఆలోచన ఉంది. మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దీనికి సంబంధించిన ప్రపోజల్స్ తయారు చేసి శాంక్షన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పటికీ మంజూరు కాలేదు. అలాగే పటాన్ చెరు నుంచి సంగారెడ్డి మీదుగా వెళ్తున్న 65వ నేషనల్ హైవే రుద్రారం, మామిడిపల్లి చౌరస్తా, కంది, పోతిరెడ్డిపల్లి చౌరస్తా, పెద్దాపూర్, సదాశివపేట, ఆరూర్ మీదుగా దాదాపు 50 కిలోమీటర్ల మేరకు అండర్ పాస్ నిర్మాణం జరగాల్సి ఉంది. పదేళ్లుగా ఆ ప్రపోజల్ పెండింగ్​లోనే ఉంది. అండర్ పాస్ నిర్మాణం లేక హైవేపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో నవోదయ, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా చాలా కాలంగా ఉంది.