- ప్రాణ భయంతో బయటకు పరుగులు తీసిన కార్మికులు
జిన్నారం, వెలుగు : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలోని హెటిరో పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమలోని ఈటీపీ సెక్షన్లో ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. పోలీసులు, కార్మికుల కథనం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పరిశ్రమలోని ఈటీపీ ప్లాంట్లో సాల్వెంట్ల రికవరీ సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీంతో భయాందోళనకు గురైన కార్మికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.
భారీగా మంటలు ఎగిసిపడడంతో పరిశ్రమ అధికారులు ఫైర్ ఇంజన్లకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. దాదాపు మూడు గంటలు శ్రమించి మంటలను ఆర్పారు. కాగా ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదని బొల్లారం సీఐ గంగాధర్ తెలిపారు. ఆస్తి నష్టం భారీగా సంభవించి ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు.