వోక్స్‌వ్యాగన్ కంపెనీలో అల్లకల్లోలం: 10వేల ఉద్యోగాలు హుష్!

జర్మనీ ఆటోమొబైల్ సంస్థ వోక్స్‌వ్యాగన్ వేలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఏకంగా పదివేల మంది సిబ్బందిని తొలగించడంతోపాటు జర్మనీలోని మూడు కర్మాగారాలను మూసివేయాలని నిర్ణయించింది. తగినంత డిమాండ్ లేకపోవడం.. ఖర్చులు పెరిగిపోతుండటంతో కంపెనీకి మరో దారి కనిపించలేదని వోక్స్‌వ్యాగన్ బ్రాండ్ సీఈఓ థామస్ స్కేఫర్ ఒక ప్రకటనలో తెలిపారు. 

ఉద్యోగాల కోతల సంఖ్యపై యాజమాన్యం స్పష్టత ఇవ్వనప్పటికీ, దాదాపు పదివేల తొలగింపులు ఉండవచ్చని రాయిటర్స్ పేర్కొంది. ఈ ప్రకటన యూరప్ అంతటా అల్లకల్లోలం సృష్టిస్తోంది. వందల సంఖ్యలో ఉద్యోగులు వోక్స్‌వ్యాగన్ కార్యాలయాలను చుట్టుముట్టి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ సంస్థ 1994లో ఉద్యోగ రక్షణ కల్పిస్తామని, 2029 వరకు ఎటువంటి తొలగింపులు చేపట్టమని ఉద్యోగులకు మాటిచ్చింది. ఆ ప్రతిజ్ఞ సంగతేంటని ఉద్యోగులు.. యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు.

సంస్థను నడిపే పరిస్థితి లేదు..

"ప్రస్తుతం వోక్స్‌వ్యాగన్ సంస్థకు తగినన్ని డిమాండ్లు రావడం లేదు. ఆర్థిక పరిస్థితి అంతకంతకూ క్షీణీస్తోంది. అదే సమయంలో ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. ఇలానే ఇంకొంత కాలం ముందుకెళ్లే పరిస్థితి లేదు. కావున యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులు గౌరవించాలి.." అని కార్మికులను ఉద్దేశిస్తూ సంస్థ సీఈఓ థామస్ స్కేఫర్ ప్రకటన చేశారు.

ALSO READ : పరిస్థితి ఇంత దారుణమా : ఇంటెల్ కంపెనీలో ఫ్రీ కాఫీ, టీ బంద్.. నెక్ట్ లెవల్ ఏంటో ఊహించుకోండి..!

వోక్స్‌వ్యాగన్ సంస్థకు ఒక్క జర్మనీలో దాదాపు 3లక్షల మంది సిబ్బంది ఉండగా.. 10 ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. వీరిలో ఎంతమందిని తొలగించవచ్చనేది స్పష్టత లేదు.