మార్కెట్‌కు ట్రంప్ జోష్‌

  • రూ. 7.75 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
  • 24,500 కి చేరువలో నిఫ్టీ
  • మెరిసిన  ఐటీ, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్‌‌‌‌ షేర్లు

ముంబై: యూఎస్‌‌‌‌లో ట్రంప్ గెలుపు  ఇండియన్ మార్కెట్లకు  కొత్త ఊపునిచ్చింది. ముఖ్యంగా ఐటీ షేర్లు  బుధవారం ర్యాలీ చేశాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 4 శాతం పెరగగా, ఈ ఇండెక్స్‌‌‌‌లోని మొత్తం షేర్లు ఒక శాతం నుంచి 6 శాతం మధ్య ర్యాలీ చేశాయి.  పెరిసిస్టెంట్‌‌‌‌, టీసీఎస్‌‌‌‌, హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌ టెక్  షేర్లు ఎక్కువగా పెరిగాయి. ట్రంప్ ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్‌‌‌‌లను తగ్గించే అవకాశం ఉంది. దీంతో  యూఎస్‌‌‌‌లో వినియోగం పెరుగుతుందని,  ఫలితంగా ఇండియన్ ఐటీ కంపెనీలు లాభపడతాయనే  అంచనాలు ఎక్కువయ్యాయి.

ఐటీతో పాటు రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్‌‌‌‌, మెటల్‌‌‌‌ షేర్లు లాభాల్లో కదలడంతో బెంచ్‌‌‌‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ బుధవారం 271 పాయింట్లు (1.12 శాతం) లాభపడి 24,484 దగ్గర సెటిలయ్యింది.  సెన్సెక్స్ 902 పాయింట్లు పెరిగి 80,378 దగ్గర ముగిసింది. అన్ని సెక్టార్ల ఇండెక్స్‌‌‌‌లు  పాజిటివ్‌‌‌‌గా క్లోజయ్యాయి. బీఎస్‌‌‌‌ఈ మిడ్‌‌‌‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌‌‌‌లు 2 శాతం వరకు ర్యాలీ చేశాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.7.75 లక్షల కోట్లు  పెరిగింది. బీఎస్‌‌‌‌ఈలోని కంపెనీల మొత్తం  మార్కెట్ క్యాప్  రూ.449 లక్షల కోట్లకు చేరుకుంది. డాలర్ బలపడడంతో మారకంలో రూపాయి విలువ 22 పైసలు తగ్గి 84.31 దగ్గర ఆల్ టైమ్ కనిష్టాన్ని రికార్డ్ చేసింది.  

చైనాపై పెరగనున్న రిస్ట్రిక్షన్లు..ఇండియాకు మేలు

చైనా నుంచి చేసుకునే దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం టారిఫ్స్ పెంచుతుందని, ఇది ఇండియాకు మేలు చేస్తుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. కేవలం ఐటీ ఎగుమతులే కాకుండా, ఇతర సెక్టార్ల ఎగుమతిదారులకు ఇది మేలు చేస్తుందని పేర్కొన్నారు.  నిఫ్టీ బ్రేకౌట్‌‌‌‌కు దగ్గరలో ఉందని, అదే జరిగితే 25,130 వరకు పెరగొచ్చని, దిగువన 24,3‌‌‌‌‌‌‌‌00 దగ్గర సపోర్ట్ దొరుకుతుందని ప్రోగ్రెసివ్ షేర్స్ ఎనలిస్ట్    ఆదిత్య గగ్గర అన్నారు. 24,500 లెవెల్‌‌‌‌ను దాటితే నిఫ్టీ మరింతగా పెరుగుతుందని, 25,000 వరకు వెళ్లొచ్చని, దిగువన 24,35‌‌‌‌‌‌‌‌0 సపోర్ట్‌‌‌‌గా పని చేస్తుందని హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ సెక్యూరిటీస్‌‌‌‌ ఎనలిస్ట్ నాగరాజ్‌‌‌‌ శెట్టి పేర్కొన్నారు.

మార్కెట్ పెరగడానికి కారణాలు..

1) ట్రంప్ మెజార్టీ..

 ట్రంప్‌‌‌‌ ప్రెసిడెంట్ అయితే  ఫ్రెండ్లీ ఎకనామిక్ పాలసీలను చూడొచ్చని ఈక్వినామిక్స్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ ఫౌండర్ జీ చొక్కలింగమ్‌‌‌‌ అన్నారు. ట్రంప్ గెలవడంతో  ఆటో, ఎనర్జీ, మెటల్ సెక్టార్లకు ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. కాగా, ఇండియా గూడ్స్ ఎగుమతుల్లో 18 శాతం యూఎస్‌‌‌‌కు జరుగుతున్నాయి. ఇందులో ఎక్కువగా  ఎలక్ట్రానిక్స్‌‌‌‌, ముత్యాలు, విలువైన రాళ్లు, ఫార్మాస్యూటికల్స్‌‌‌‌, న్యూక్లియర్ రియాక్టర్లు, పెట్రోలియం ప్రొడక్ట్‌‌‌‌లు,  ఐరన్‌‌‌‌ ,  స్టీల్‌‌‌‌, టెక్స్‌‌‌‌టైల్స్‌‌‌‌, వెహికల్స్ ఉన్నాయి.

అంతేకాకుండా ఇండియా నుంచి ఐటీ ఎగుమతులు ఎక్కువగా యూఎస్‌‌‌‌కే  జరుగుతున్నాయి. ‘యూఎస్‌‌‌‌లో ఎవరు గెలుస్తారనేది కాకుండా ఏదో ఒక పార్టీకి క్లియర్‌‌‌‌‌‌‌‌గా మెజార్టీ రావడం మార్కెట్‌‌‌‌కు ఊరటనిచ్చే అంశం’ అని ఈక్విరస్‌‌‌‌ ఎకనామిస్ట్ అనిత రంగన్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల్లో క్లారిటీ ఉంటే  మార్కెట్ దృష్టి మళ్లీ ఫండమెంటల్స్‌‌‌‌పై పడుతుందని, ఇండియా ఎకానమీ స్ట్రాంగ్‌‌‌‌గా ఉందని వివరించారు.  గత నెల రోజులుగా విదేశీ ఇన్వెస్టర్లు షేర్లను అమ్మేస్తుండగా,  ఈ ట్రెండ్ రివర్స్ అవ్వొచ్చని అన్నారు. కాగా, ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌ఐఐలు) బుధవారం సెషన్‌‌‌‌లో నికరంగా రూ. 4,445 కోట్ల విలువైన షేర్లను అమ్మగా, డీఐఐలు రూ. 4,889 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. 

2) కరెక్షన్‌‌‌‌ తర్వాత  లాభాల్లోకి..

కిందటి నెలలో నిఫ్టీ 6 శాతానికి పైగా నష్టపోయింది. బీఎస్‌‌‌‌ఈ సెన్సెక్స్ 5.7 శాతం పడింది. దీంతో క్వాలిటీ షేర్లు తక్కువ లెవెల్స్‌‌‌‌ దగ్గర ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్లు వీటిని కొనడానికి ఎగబడ్డారని చొక్కలింగమ్‌‌‌‌  అభిప్రాయపడ్డారు.  అంతేకాకుండా యూఎస్ ఎన్నికలపై అనిశ్చితి తొలగిపోవడం కూడా మార్కెట్ పెరగడానికి కారణం. 

3)  మిశ్రమంగా గ్లోబల్‌‌‌‌ మార్కెట్లు..

ఆసియా మార్కెట్‌‌‌‌లు బుధవారం సెషన్‌‌‌‌లో మిశ్రమంగా కదిలాయి. జపాన్ నికాయ్‌‌‌‌ 2 శాతం పెరిగింది. కానీ, చైనీస్ మార్కెట్‌‌‌‌లు పడ్డాయి. హాంకాంగ్ మార్కెట్ బుధవారం 2 శాతం పడింది. కొరియా మార్కెట్ అర శాతం పడింది. యూరప్ మార్కెట్‌‌‌‌లు కూడా నష్టాల్లో కదిలాయి. జర్మనీ డాక్స్ ఒక శాతం, ఫ్రాన్స్‌‌‌‌ మార్కెట్ అర శాతం పడ్డాయి. ట్రంప్ గెలుపుతో యూఎస్ మార్కెట్ బుధవారం ర్యాలీ చేశాయి. డౌ జోన్స్‌‌‌‌ 3 శాతానికి పైగా పెరగగా, ఎస్‌‌‌‌ అండ్ పీ 500 రెండు శాతం లాభపడ్డాయి.