ఎఫ్‌ఐఐల రాకతో స్టాక్ మార్కెట్‌ జూమ్‌

  • కొనసాగిన ర్యాలీ..నిఫ్టీ 314 పాయింట్లు అప్‌‌
  • 38 సెషన్ల తర్వాత నికరంగా రూ.9,948 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌‌ఐఐలు
  • మహారాష్ట్రలో ఎన్‌‌డీఏ గెలవడం, బ్లూచిప్ షేర్లు ఆకర్షణీయంగా ఉండడమే కారణం

ముంబై : కీలకమైన మహారాష్ట్ర  అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌‌డీఏ బంపర్ మెజార్టీతో గెలవడం ఇన్వెస్టర్లలో కాన్ఫిడెన్స్ నింపింది. గత38 సెషన్లుగా  నికర అమ్మకందారులుగా కొనసాగిన  ఫారిన్ ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌ఐఐలు), సోమవారం నికరంగా రూ.9,948 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఫలితంగా బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు సెన్సెక్స్‌‌, నిఫ్టీ ఒక శాతానికిపైగా లాభపడి కీలక లెవెల్స్‌‌ పైన ముగిశాయి.  

అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌‌డీఏ ఆధిపత్యం కొనసాగడం,  తాజా మార్కెట్‌‌ కరెక్షన్‌‌తో  క్వాలిటీ షేర్లు తక్కువ రేటుకే దొరుకుతుండడంతో ఇన్వెస్టర్లు గత రెండు సెషన్లుగా ఎగబడుతున్నారు. నిఫ్టీ శుక్రవారం 2.5 శాతం పెరగగా, సోమవారం 1.32 శాతం (314 పాయింట్లు) పెరిగి 24,222 వద్ద సెటిలయ్యింది. సెన్సెక్స్   993 పాయింట్లు (1.25 శాతం) పెరిగి  80,110 వద్ద  ముగిసింది.

ఈ ఏడాది రూ.2.84 లక్షల కోట్లు విత్‌‌డ్రా..

ఈ నెలలో ఎఫ్‌‌ఐఐలు నికరంగా రూ.26,500 కోట్లను, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.2.84 లక్షల కోట్లను ఇండియన్ మార్కెట్ నుంచి విత్‌‌డ్రా చేసుకున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో  డాలర్ బలపడడం, బాండ్‌‌ ఈల్డ్‌‌లు పెరగడం ఇందుకు కారణం. మరోవైపు చైనీస్ మార్కెట్‌‌లు ఆకర్షణీయంగా ఉండడంతో కూడా ఎఫ్‌‌ఐఐలు మన మార్కెట్‌‌లో నికర అమ్మకందారులుగా మారారు.   ఎఫ్‌‌ఐఐలు సోమవారం సెషన్‌‌లో మాత్రం రూ.85,252 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. 

రూ.75,3‌‌‌‌04 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.  ఇప్పటి వరకు మార్కెట్‌‌కు సపోర్ట్‌‌గా నిలిచిన డొమెస్టిక్ ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు మాత్రం సోమవారం నికరంగా రూ.6,908 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.

ఇన్వెస్టర్ల సంపద 14.12 లక్షల కోట్లు అప్​ 

మార్కెట్ గత రెండు సెషన్లలో  సుమారు 4 శాతం ర్యాలీ చేయడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.14.12 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్‌‌లో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్‌‌ క్యాపిటలైజేషన్ రూ.440 లక్షల కోట్లకు ఎగిసింది.  సెన్సెక్స్‌‌లో  ఎల్‌‌ అండ్ టీ, ఎస్‌‌బీఐ, అదానీ పోర్ట్స్‌‌, రిలయన్స్ ఇండస్ట్రీస్‌, పవర్ గ్రిడ్‌‌, ఐసీఐసీఐ బ్యాంక్‌‌, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ , టీసీఎస్‌‌, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్  షేర్లు సోమవారం ఎక్కువగా లాభపడ్డాయి. జేఎస్‌‌డబ్ల్యూ స్టీల్‌‌, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్‌‌, మారుతి, ఏషియన్ పెయింట్స్‌‌, హెచ్‌‌సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. 

సెన్సెక్స్‌‌ సవరణలో భాగంగా జేఎస్‌‌డబ్ల్యూ స్టీల్  ప్లేస్‌‌ను జొమాటో డిసెంబర్‌‌‌‌ 23 నుంచి భర్తీ చేయనుంది. బీఎస్‌‌ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ సోమవారం 1.86 శాతం లాభపడగా,  మిడ్‌‌క్యాప్ ఇండెక్స్ 1.61 శాతం పెరిగింది. సెక్టార్ల పరంగా చూస్తే, ఇండస్ట్రియల్స్‌‌  3.29 శాతం లాభపడగా, క్యాపిటల్ గూడ్స్‌‌ 3.27 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్‌‌ 3.26 శాతం, ఎనర్జీ 2.56 శాతం, రియల్టీ 2.22 శాతం, బ్యాంకెక్స్‌‌ 2.06 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌ 1.89 శాతం లాభపడ్డాయి.

అదానీ షేర్లు డౌన్‌‌..

ఐదు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు సోమవారం నష్టాల్లో కదిలాయి. గౌతమ్ అదానీ తనపై బుక్‌‌ అయిన  లంచం కేసును క్లియర్ చేసుకునేంతవరకు అదానీ గ్రూప్‌‌లో ఇన్వెస్ట్ చేయమని   ఫ్రెంచ్‌‌ ఇంధన కంపెనీ టోటల్‌‌ఎనర్జీస్ ప్రకటించింది. దీంతో  అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు సోమవారం 8 శాతం పతనమయ్యాయి. ఇంట్రాడేలో 11 శాతం పడ్డాయి. 

అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు 4 శాతం, అదానీ పవర్ 3 శాతం, ఎన్‌‌డీటీవీ 2 శాతం, అదానీ టోటల్‌‌గ్యాస్ షేర్లు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. మరోవైపు అదానీ పోర్ట్స్ షేర్లు రెండున్నర శాతం పెరగగా, ఏసీసీ రెండున్నర శాతం, అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ షేర్లు ఒకటిన్నర శాతం లాభపడ్డాయి. అదానీ విల్‌‌మార్‌‌‌‌ షేర్లు రెండు శాతం పెరిగాయి.