దారుణం.. ఇంట్లోకి చొరబడి..కత్తులతో నరికి చంపారు

  • ఇన్​ఫార్మర్ నెపంతో ఇద్దరు ఆదివాసీల హత్య 
  • ములుగు జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం
  • మృతుల్లో పంచాయతీ కార్యదర్శి

జయశంకర్‌‌‌‌‌‌ భూపాలపల్లి/వెంకటాపురం, వెలుగు: ఇన్‌‌‌‌ఫార్మర్ల నెపంతో ఇద్దరు ఆదివాసీలను మావోయిస్టులు హత్య చేశారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి కత్తులతో నరికి చంపేశారు. ములుగు జిల్లా వాజేడు పట్టణంలో ఈ దారుణం జరిగింది. 

మృతుల్లో ఒకరు గవర్నమెంట్‌‌‌‌  ఉద్యోగి. ములుగు  జిల్లా వాజేడు మండల కేంద్రంలోని జంగలపల్లి (పెనుగోలు కాలనీ) లో ఉంటున్న పేరూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉయిక రమేశ్ (35), వరసకు సోదరుడైన ఉయిక అర్జున్ (40) ను  మావోయిస్టులు గురువారం అర్ధరాత్రి హత్య చేశారు.  

తమ గురించి పోలీసులకు సమాచారం  చేరవేస్తున్నారని, పలుసార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడంతో వారిని హత్య చేశామని మావోయిస్టు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత పేరుతో  మావోయిస్టులు ఘటనా స్థలంలో లేఖలు వదిలి వెళ్లారు. 

కనికరించాలని వేడుకున్నా.. 

సాయుధులైన మావోయిస్టులు రెండు గ్రూపులుగా గురువారం అర్ధరాత్రి 11 గంటలకు  ఉయిక రమేశ్, ఉయిక అర్జున్  ఇంటికి వచ్చారు. పేరూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేశ్  ఇటీవలే పెనుగోలు కాలనీలో కొత్త ఇల్లు కట్టిస్తున్నాడు. అక్కడే  రేకుల షెడ్ వేసుకుని  ఉంటున్నాడు. 

గురువారం రాత్రి ఇంటికొచ్చి పడుకున్నాడు. షెడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసుకున్న గ్రీన్ మ్యాట్ ను కట్ చేసుకొని మావోయిస్టులు రమేశ్  ఇంట్లో చొరబడ్డారు. మంచంపై పడుకున్న రమేశ్ పై గొడ్డలితో దాడి చేశారు. 

దీంతో అతను గట్టిగా ఆరవడంతో పక్కనే నిద్రిస్తున్న అతని భార్య రాం బాయి మేల్కొని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆమెను మరొక మావోయిస్టు కాలితో గట్టిగా తన్నడంతో కింద పడిపోయింది. వెంటనే ముగ్గురు వ్యక్తులు రమేశ్ పై విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయారు. అదే సమయంలో మరో ముగ్గురు మావోయిస్టులు అర్జున్  ఇంటికి వెళ్లారు. ఇంటికి తలుపులు లేకపోవడంతో లోపలికి చొరబడి దాడి చేశారు.

 దీంతో అర్జున్  అక్కడికక్కడే మరణించాడు. రమేశ్  కు భార్య రాంబాయి, ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అర్జున్ కు తండ్రి సాయన్న, భార్య సావిత్రి, ముగ్గురు పిల్లలు ఉన్నారు.  కాగా.. ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గుట్టలపై నివాసం ఉంటున్న కుటుంబాలలో ఉన్నత విద్య చదివి ఉద్యోగం చేస్తున్న వ్యక్తిగా రమేశ్ కు మంచి పేరు ఉంది.

 గుట్టలపై నివసిస్తున్న వారిలో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం గుట్ట దిగి వాజేడు మండల కేంద్రం సమీపంలో పెనుగోలు కాలనీ ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. అందులో రమేశ్‌‌‌‌ తల్లిదండ్రులు కూడా ఒకరు. 2018లో జూనియర్  పంచాయతీ సెక్రటరీగా రమేశ్  ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం వాజేడు మండలంలోని పేరూరు పంచాయతీ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్నారు.

ఉనికి కోసమే ఆదివాసీ గిరిజనుల హ్యతలు: ఎస్పీ శబరీశ్‌‌‌‌  

మావోయిస్టులు తమ ఉనికి కోసమే ఇద్దరు ఆదివాసీలను అతి కిరాతకంగా హత్య చేశారని ములుగు జిల్లా ఎస్పీ శబరీశ్‌‌‌‌  శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కనీస వసతులు లేకున్నా  పట్టుదలతో చదివి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఎంపైకైన రమేశ్ ను.. మావోయిస్టు పార్టీకి సహకరించడం లేదని,  అటవీ ఉత్పత్తుల సేకరణ మీద ఆధారపడి జీవనం కొనసాగించే ఉయిక అర్జున్ ను ఒత్తిడి చేసినా మావోయిస్టు పార్టీలో చేరలేదని ఎస్పీ తెలిపారు.

 ఆదివాసీలను ఇన్ ఫార్మర్ల నెపం తో చంపడం అన్యాయమని ఆదివాసీ  ఉద్యోగ సంఘం నాయకులు, తుడుందెబ్బ నాయకులు అన్నారు. హత్యలను ఆలిండియా ఆదివాసీ ఎంప్లాయీస్  ఫెడరేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు మంకిడి రవి, రాష్ట్ర కార్యదర్శి అన్నవరం రవికాంత్, తుడుందెబ్బ ములుగు డివిజన్  అధ్యక్షుడు, పీసా కమిటీ జిల్లా కార్యదర్శి వజ్జ రాజు ఖండించారు.