ఖానాపూర్, వెలుగు : వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే హాస్పిటల్ ఏర్పాటు చేసి ట్రీట్‌మెంట్ చేస్తున్నారంటూ పలువురు యువకులు, మహిళలు ఓ హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే... నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో రెండు నెలల కింద తిరుమల పిల్లల అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభమైంది. రెండు రోజుల కింద ఖానాపూర్ పట్టణానికి చెందిన పి. మల్లవ్వ అనారోగ్యం కారణంగా ఈ హాస్పిటల్‌లో చేరి ట్రీట్‌మెంట్ తీసుకుంది. చికిత్స అనంతరం బిల్లులు ఇవ్వాలని మహిళ బంధువులు కోరడంతో ఓ తెల్ల కాగితంపై బిల్లులు రాసి ఇచ్చారు. తెల్ల కాగితం మీద బిల్లులు ఇవ్వడం ఏంటని మహిళ బంధువులు ప్రశ్నించడంతో హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.
దీంతో ఆగ్రహించిన వారు శుక్రవారం హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హాస్పిటల్‌లో పనిచేసే మహిళా డాక్టర్‌కు అసలు తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషనే లేదన్నారు. పర్మిషన్ లేకుండా హాస్పిటల్ నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, హాస్పిటల్‌ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆసుపత్రి నిర్వాహకులను సంప్రదించగా ఎక్కువ బిల్లులు ఇస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. తమ హాస్పిటల్‌కు రిజిస్ట్రేషన్ లేదని ఒప్పుకున్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న నిర్మల్ డీఎంహెచ్‌వో హాస్పిటల్‌కు వచ్చి రికార్డులను పరిశీలించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.