మీకు తెలుసా: ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారు కదా.. వీటిని తీసుకొచ్చింది ఈ మన్మోహన్ సింగ్నే..

మన్మోహన్ సింగ్ ఈ తరానికి మాజీ ప్రధాని గానే తెలుసు. కానీ.. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, ప్రస్తుతం దేశ ప్రజలు డిజిటల్ ఇండియాలో పొందుతున్న సౌలభ్యాలు.. మన్మోహన్ చలవేనన్న సంగతి చాలామందికి తెలియదు. UPI(యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంటే ఏంటో ఈరోజుల్లో తెలియని వారుండకపోవచ్చు. యూపీఐ అనేది మన్మోహన్ మానసపుత్రిక. యూపీఐని.. అదేనండీ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం.. తదితర యాప్స్ ద్వారా.. ఇలా ఇన్స్టాంట్ మొబైల్ పేమెంట్స్ చేసుకునే విధానాన్ని  నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసింది.

ఆధార్ ఆలోచన చేసినప్పుడే NPCI వైపు ఇండియాను నడిపించాలని, పేమెంట్ సిస్టంలో విప్లవాత్మక మార్పు తీసుకురావాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ భావించారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే.. NPCI 2010లో IMPS( Immediate Payment Service) ను దేశానికి పరిచయం చేసింది. ఇప్పుడు మనం చేస్తున్న యూపీఐ పేమెంట్లకు మొదట అంకురార్పణ చేసింది ఇక్కడే. 2010లో ఐఎంపీఎస్ ఒక విప్లవాత్మకమైన పరిణామం. అప్పటి ప్రధాని, ప్రఖ్యాత ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఇందుకు ఆద్యులు.

బ్యాంకులకు వెళ్లి మన ఖాతా నుంచి మరొకరి ఖాతాకు డబ్బును బదిలీ చేసే తిప్పల నుంచి ఐఎంపీఎస్ ద్వారా సెకన్లలోనే నగదు బదిలీ చేసే వెసులుబాటు దేశ ప్రజలకు మన్మోహన్ అందుబాటులోకి తెచ్చారు. 2010లోనే ఇంత విజనరీగా ఆయన థింక్ చేశారంటే మన్మోహన్ దూరదృష్టికి ఇంతకు మించిన రుజువు అవసరం లేదు. ఐఎంపీఎస్ విధానం ద్వారా సెకన్లలో మనీ ట్రాన్స్ఫర్ 2010లోనే సాధ్యమయ్యేలా చేసిన విజనరీ లీడర్ మన్మోహన్ సింగ్. యూపీఐ అనే ఆలోచన అక్కడ నుంచి పుట్టిందేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Also Read : మన్మోహన్ సింగ్, కాకా వెంకటస్వామి మంచి ఫ్రెండ్స్

మన్మోహన్ సింగ్ సారథ్యంలో దేశంలో మొదలైన తక్షణ నగదు బదిలీ ఫలాలను ప్రస్తుతం మనం అనుభవిస్తున్నాం. యూపీఐ విధానం విజయవంతం కావడం వెనుక కూడా పరోక్షంగా మన్మోహన్ సింగే ఉన్నారు. 2008లో యూపీఏ హయాంలోనే NPCI పురుడు పోసుకుంది. ఆ తర్వాత ప్రధానిగా మన్మోహన్ సింగ్ NPCI అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టంను డెవలప్ చేసింది కూడా NPCI కావడం గమనార్హం.

NPCI తీసుకొచ్చిన విప్లవాత్మక విధానాలు:
* నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ (NFS)
* ఐఎంపీఎస్ ( IMPS)
* యూపీఐ (UPI)
* భారత్ బిల్ పేమెంట్ సిస్టం (Bharat Bill Payment System)
* రూపే కార్డ్ (RuPay Card)
* నేషనల్ ఆటోమేటిక్ క్లియరింగ్ హౌస్ (NACH)
* ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (Aadhar Enabled Payment System)
* చెక్ ట్రంకేషన్ సిస్టం ( Cheque Truncation System)
* ఎన్యూయూపీ (NUUP Service)