- కలుషిత నీటి కారణంగా పంటలకు ఎఫెక్ట్
- నీళ్లు తాగి చనిపోతున్న మూగజీవాలు
- మంజీరాను కాపాడాలని కోరుతున్న రైతులు, ప్రజలు
సంగారెడ్డి, వెలుగు: మంజీరా నదిలోకి చక్కెర ఫ్యాక్టరీ వ్యర్థజలాలు చేరుతుండగా కలుషితమవుతున్నాయి. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చక్కెర ఫ్యాక్టరీ వదులుతున్న వ్యర్థజలాలు కాల్వల ద్వారా మంజీరాలోకి చేరుతున్నాయి. దీంతో ప్రాజెక్టులోని నీళ్లు విషంగా మారే ముప్పు పొంచి ఉంది.
సంగారెడ్డి జిల్లా రాయికోడ్, న్యాల్ కల్ పరిధిలో కొత్తగా చక్కెర ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. యాజమాన్యం అక్రమంగా వదులుతున్న కలుషిత జలాల కారణంగా ప్రజలకు, వ్యవసాయానికి శాపంగా మారింది. జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని చెరుకు రైతుల సౌకర్యార్థం రెండు నెలల కింద వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చెక్కర ఫ్యాక్టరీని ప్రారంభించారు.
జిల్లాలోని చెరుకు రైతులకు ఉంతో ఉపయోగంగా ఉంటుందని భావించారు. కానీ ఫ్యాక్టరీ క్రషింగ్ ద్వారా బయటకు వచ్చే వ్యర్థ జలాలు నేరుగా పంట పొలాల్లోకి, పక్కనే ఉన్న మంజీరా ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. రూల్స్ కు విరుద్ధంగా ఫ్యాక్టరీ బయటకు పంపిస్తుండడంతో పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. కార్మిక చట్టాలతో పాటు పర్యావరణం, నీటిపారుదల శాఖ ఇతరత్రా అనుమతులను బేఖాతరు చేస్తూ ఫ్యాక్టరీని నడిపిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ..
చెరుకు రైతుల కోసం రూ. 250 కోట్లతో నిర్మించిన చక్కెర ఫ్యాక్టరీతో ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువగా కనిపిస్తోంది. ఫ్యాక్టరీ మంజీరా బ్యాక్ వాటర్ దగ్గరగా ఉండడంతో రాఘవాపూర్ శివారులోని కాల్వల ద్వారా వ్యర్థ జలాలు వెళ్తున్నాయి. వాటిని తాగుతున్న మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి.
వ్యవసాయ పొలాల్లో వ్యర్థాలు చేరడంతో భరించలేని దుర్వాసన వస్తోంది. రైతులు తమ పంట పొలాల్లోకి కూడా వెళ్లలేకపోతున్నారు. పంటలు పండించుకునే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు. దాదాపు 800 ఎకరాల్లోకి ఫ్యాక్టరీ కలుషిత జలాలు చేరినట్టు తెలుస్తోంది. నిర్మాణ సమయంలో నాసిరకం సామగ్రి వాడకం, కాలం చెల్లిన మెషీన్లతో ప్రమాదకరంగా మారిందని కార్మికులు చెబుతున్నారు.
ఫ్యాక్టరీ ఏర్పడితే స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి దొరుకుతుందని భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయంటున్నారు. ఇటీవల సుమారు 800 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన వేడి నీరు ప్రమాదవశాత్తూ పడడంతో ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి. ఘటన స్థానికంగా భయాందోళనను కలిగించింది. వ్యర్థ జలాల కారణంగా పక్కనే ఉన్న చెరువులో చేపలు మృతి చెందాయి. రెండు నెలల వ్యవధిలోనే ఇన్ని అనర్థాలు జరిగితే భవిష్యత్ లో ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమంగా మంజీరా నీరు
మంజీరా వాటర్ వర్క్స్ నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే చక్కెర ఫ్యాక్టరీకి నది నీటిని వినియోగించుకున్నట్టు తెలిసింది. రాఘవపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు వ్యవసాయ సాగు నిమిత్తం మంజీరా నది నుంచి పంట పొలానికి పైప్ లైన్ వేసుకున్నాడు. అక్కడి నుంచి ఫ్యాక్టరీ యాజమాన్యం అక్రమంగా వాడుకుంటోంది. అక్రమ నీటి వాడకాన్ని అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో ఫ్యాక్టరీ యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రూల్స్ కు వ్యతిరేకంగా కొనసాగుతున్న చక్కెర ఫ్యాక్టరీతో స్థానికులు, కార్మికులు, రైతులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చక్కెర ఫ్యాక్టరీ నుంచి వచ్చే కలుషిత జలాలను మళ్లించి తమ పంట పొలాలు, మంజీరా ప్రాజెక్టును కాపాడాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు.
మంజీరాను కాపాడాలి
చక్కెర ఫ్యాక్టరీ నుంచి వచ్చే కలుషిత జలాలను మంజీరాలోకి పోకుండా చూడాలి. లేకుంటే మంజీరా నది పూర్తిగా కలుషితమవుతుంది. చక్కెర ఫ్యాక్టరీతో ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువగా ఉంది. కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.
– సుధాకర్ రెడ్డి, రాఘవపూర్ -
వ్యర్థాలను తొలగించాలి
చక్కెర ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలను తొలగించాలి. కలుషిత నీరు పంట పొలాల్లో చేరి దుర్వాసన వస్తోంది. రూల్స్ కు అనుగుణంగా వ్యర్థాలను తరలించి పంట పొలాలను కాపాడాలి. వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నాం. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు చేస్తాం.
– వెంకట్,రాఘవపూర్-