పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలి : సయింపు శ్రీనివాస్

కోటపల్లి, వెలుగు: పెండింగ్​లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే రిలీజ్​ చేయాలని తపస్ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సయింపు శ్రీనివాస్ డిమాండ్​ చేశారు. కోట పల్లి మండలం పారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో గురువారం తపస్ సభ్యత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న డీఏలను విడుదల చేసి బిల్లులన్నీ ఏకకాలంలో చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. 

అలాగే పీఆర్ సీని ప్రకటించాలన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో భాగంగా సీపీఎస్ ను రద్దుచేసి ఓపీఎస్​ను అమలు చేసి, ఆదర్శ పాఠశాల టీచర్లకు బదిలీలతో పాటు ప్రమోషన్లు చేపట్టాలన్నారు. కేజీబీవీ టీచర్లు, సిబ్బందికి కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్యక్రమంలో తపస్ మండల అధ్యక్షుడు చెట్ల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి పీసరి రాజేందర్, కార్యదర్శి రాపర్తి సునీల్ పాల్గొన్నారు.