మాతాశిశు మరణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

నస్పూర్, వెలుగు: జిల్లాలో మాతా–శిశు మరణాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టా లని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో వైద్యారోగ్యశాఖ అధికారి హరీశ్ రాజ్, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రమణ, ఫాక్సి జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ స్వరూపతో కలిసి ప్రోగ్రాం అధికారులతో రివ్యూ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మాతాశిశు మరణాల రేటు పూర్తిగా నియంత్రించేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

మహిళలు, పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గర్భం దాల్చిన మహిళలు తమ వివరాలు నమోదు చేసుకొని వైద్య పరీక్షలు, మందులు పొందేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ అనిత, డాక్టర్ కృపాబాయి, డాక్టర్ సుధాకర్ నాయక్, జిల్లా సంక్షేమాధికారి స్వరూపారాణి, డాక్టర్ కృష్ణవేణి, డీపీవో ప్రశాంతి, వైద్యాధికారులు, సీహెచ్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.