బ్యాంక్ అధికారులను నమ్మించి రూ.50 వేలతో పరార్

  • దొంగ అరెస్ట్ 

మంచిర్యాల, వెలుగు: బ్యాంకు అధికారులను నమ్మించి రూ.50 వేలతో ఉడాయించిన దొంగను మంచిర్యాల పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సీఐ బన్సీలాల్ వివరాలు వెల్లడించారు. మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తాలోని హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​లో క్యాష్ ​కౌంటింగ్​మెషీన్​లో సమస్య వచ్చింది.

దీంతో రిపేర్​కోసం గత నెల 24న రోహిత్ బాబూలాల్ ప్రకాశ్ కాలే అనే వ్యక్తిని బ్యాంకుకు పిలిపించారు. మెషీన్​ను బాగు చేస్తున్నట్లు నటించిన ప్రకాశ్.. కొద్దిసేపటి తరువాత మెషీన్​ను చెక్ చేయాలని క్యాషియర్ నుంచి రూ.50 వేల నగదు తీసుకున్నాడు.

ఆ తర్వాత అధికారుల దృష్టి మళ్లించి అక్కడి నుంచి ఉడాయించాడు. మోసపోయామని గ్రహించిన బ్యాంకు అధికారులు అదేరోజు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిండితుడిని ఆదివారం పట్టణంలో అరెస్ట్​ చేశారు.

హైదరాబాద్ లోని మచ్చబొల్లారంకు చెందిన నిందితుడు ప్రింటింగ్, జిరాక్స్ మెషీన్లను రిపేర్ చేసేవాడు. ఈ క్రమంలోనే జల్సాలకు అలవాటుపడి మోసాలకు పాలపడుతున్నట్లు విచారణలో తేలిందని, నిందితుడిని రిమాండ్​కు తరలించిట్లు పోలీసులు తెలిపారు.