ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన డీసీపీ

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్​ ఆదివారం ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి బందోబస్తు చర్యలు, వరద ఉధృతిని పర్యవేక్షించారు. ప్రాజెక్టు నుంచి 1.44 లక్షల క్యూసెక్కుల నీటిని  రిలీజ్​ చేస్తున్నందున ప్రజలు అలర్ట్​గా ఉండాలన్నారు. పొంగుతున్న వాగులు, నిండి ఉన్న చెరువు వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, నీటి ప్రవాహం ఉన్న వంతెనలు, రోడ్ల వద్ద రాకపోకలు నిలిపివేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వరద నీరు వచ్చే లోతట్టు   గ్రామాలను గుర్తించి అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. హాజీపూర్ ఎస్సై గోపతి సురేశ్​ పాల్గొన్నారు.