ఆర్ఎంపీ వైద్యం వికటించి బ్రెయిన్ డెడ్​

దండేపల్లి, వెలుగు : ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి ఓ యువకుడు బ్రెయిన్ ​డెడ్​ అయి చనిపోయాడు. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్త కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బత్తుల మధుకర్(26)కు జ్వరం రావడంతో ఈ నెల 18న కన్నేపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ బొడ్డు శ్రీనివాస్ ను వైద్యం కోసం సలహా కోరారు. తానే వైద్యం చేసి నయం చేస్తానని చెప్పి సెలైన్ బాటిల్ లో మూడు ఇంజక్షన్లు ఇచ్చాడు. తొడకు మరో ఇంజక్షన్ ఇచ్చాడు. 

దీంతో కొద్దిసేపటికే మధుకర్ తీవ్ర అస్వస్థతకు గురవడంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేటు అస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు మధుకర్ ను పరీక్షించి పరిస్థితివిషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో అతడిని సికింద్రాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈనెల 21న బ్రెయిన్ డెడ్ అయిందని, ఆర్ఎంపీ వైద్యం వికటించడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని డాక్టర్లు వెల్లడించారు. 

వెంటిలేటర్ పై ఉంచగా వైద్య ఖర్చులు భరించలేక మంచిర్యాల ప్రభుత్వ అస్పత్రికి తీసుకువ చ్చారు. మంగళవారం తెల్లవారుజామున మధుకర్ చనిపోయినట్లు ఇక్కడి వైద్యులు వెల్లడించారు. మృతుడి తండ్రి రాజలింగయ్య ఫిర్యాదు మేరకు ఆర్​ఎంపీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఉదయ్​కిరణ్ తెలిపారు.

 ఆర్ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలి

లక్సెట్టిపేట, వెలుగు : మధుకర్ మృతికి  కారణమైన ఆర్ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం లక్సెట్టిపేటలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మృతుడి బంధువులు, గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. దీంతో లక్సెట్టిపేట, దండేపల్లి ఎస్సైలు సతీశ్, ఉదయ్ కిరణ్ సిబ్బందితో అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు రాస్తారోకో విరమించారు.