అసిఫాబాద్ జిల్లా సమీపంలో సంచరిస్తున్న పులిని బంధించారు! 

ఆసిఫాబాద్/కాగజ్ నగర్ : తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దుల్లో నెల రోజులుగా సంచరిస్తున్న మగ పెద్దపులిని మంగళవారం రాత్రి మహారాష్ట్ర ఫారెస్ట్ ఆఫీసర్లు బంధించారు. ఆ రాష్ట్రంలోని రాజురా సమీప అంతర్గం అడవిలో షూటర్ల సాయంతో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బోనులో బంధించి నాగ్​పూర్ తరలించారు. కాగజ్ నగర్ డివిజన్​లో మనుషులు, పశువుల మీద పులి దాడులు కలకలం రేపాయి. దీంతో ఇరురాష్ట్రాల ఫారెస్ట్ అధికారులు పహారా కాస్తూ ట్రాకింగ్​లో పెట్టారు.

 సోమవారం అంతర్గం అటవీసమీపంలో పులి దాడిలో రెండు పశువు లు మృతి చెందడం గుర్తించారు. వెంటనే మహారాష్ట్ర ఫారెస్ట్ ఆఫీసర్లు షూటర్లను రప్పించారు. పులి పశువుల కళేబరాలను తినేందుకు రాగా వెంటనే మత్తు ఇంజెక్షన్ షూట్ చేసి బంధించారు. అయితే.. మహారాష్ట్ర ఫారెస్ట్ అధికారులు పూర్తి వివరాలు చెప్పలేదు. కొద్ది రోజులుగా కాగజ్​నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధి సిర్పూర్ టీ రేంజ్​లో సంచరించే పులుల్లో మగ పులి చిక్కినట్లుగా నిర్ధారణకు వచ్చారు.

ఇటీవల మనుషుల మీద దాడి చేసిన పులి ఇదేనా అని నిర్ధారించేందుకు బంధించిన పులి శాంపిల్స్ ను ల్యాబ్​కు పంపించినట్లు పేర్కొన్నారు. ఆసిఫాబాద్ డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రెవాల్​ను సంప్రదించగా.. బంధించిన పులి సమాచారం అందిందని.. మహారాష్ట్ర ఫారెస్ట్ ఆఫీసర్ల నుంచి పూర్తి వివరాలు రావాల్సి ఉందని చెప్పారు.