కోల్​బెల్ట్ లో ఎస్సీ వర్గీకరణ ను వ్యతిరేకిస్తూ మాలల నిరసన

కోల్​బెల్ట్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, జాతీయ మాలమహానాడు ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ ​విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి మద్దతుగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ.. వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రిజర్వేషన్లకు ఆటంకం కలిగించేలా, ఆర్టికల్ 341కు విరుద్ధంగా ఉందని ఆరోపించారు. దేశంలోని ఎస్సీలను అస్తిరపరిచేందుకు ప్రధాని మోదీ సర్కార్​వర్గీకరణకు పూనుకుందని మండిపడ్డారు.

పార్లమెంట్ ఆమోదం లేకుండా వర్గీకరణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అంబేద్కర్​ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గజెల్లి లక్ష్మణ్, జై భీమ్ సైనిక్​దళ్​రాష్ట్ర కన్వీనర్​అసాది పురుషోత్తం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాల్తెపు శంకర్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పలిగిరి కనకరాజు, మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్​ ప్రెసిడెంట్​ పొట్ట మధుకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సొల్లు శ్రీనివాస్, మాల కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

వర్గీకరణ తీర్పుపై పునఃపరిశీలించాలి

కాగజ్ నగర్​, వెలుగు : ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కాగజ్​నగర్ పట్టణ అధ్యక్షుడు డొంగ్రి సునీల్ అన్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వర్గీకరణ రద్దు చేయాలని  నిరసన చేపట్టారు. అనంతరం సబ్ కలెక్టర్ ఆఫీస్​లో వినతి పత్రం అందజేశారు. మహానాడు అధ్యక్షుడు పరుస వెంకటేశ్,​ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకత పోరాట సమితి నాయకులు దుర్గం ఇస్తారు, రామ్​టెంకి అజయ్, తౌటి తిరుపతి, ఉపాధ్యక్షుడు మల్లెపల్లి రాజనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.