- మెదక్, జహీరాబాద్ లోక్ సభ సెగ్మెంట్లలో ప్రచార జోరు పెంచిన పార్టీలు
- ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి, కేంద్ర హోం మంత్రి, రాష్ట్ర మంత్రుల ప్రచార సభలతో శ్రేణుల్లో ఉత్సాహం
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు : పార్లమెంట్ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో విస్తరించి ఉన్న మెదక్, జహీరాబాద్లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మొన్నటి దాక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ మీటింగ్ లు నిర్వహించి లీడర్లు, క్యాడర్ ను ఎన్నికలకు సన్నద్ధం చేశాయి. ఇప్పుడు ఎలక్షన్సమీపిస్తుండడంతో ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగా పోటా పోటీగా రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు, భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు.
ఓ వైపు ఆయా పార్టీల అభ్యర్థులతో పాటు లోక్ సభ నియోజకవర్గ ఇన్చార్జిలుగా ఉన్న మంత్రులు, మాజీ మంత్రులు, రాష్ట్ర స్థాయి పార్టీ నాయకులు, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేగాక ఓటర్లను ఆకట్టుకునేలా, వారి మద్దతు కూడగట్టుకోవడానికి బడా నేతల బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ మెదక్ లోక్ సభ నియోజకవర్గ కేంద్రమైన మెదక్ పట్టణంలో సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రోడ్ షో, కార్నర్ మీటింగ్, జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి పెద్ద శంకరంపేటలో జన జాతర బహిరంగ సభ నిర్వహించింది.
ఆయా లోక్‌సభ నియోజకవర్గాల కాంగ్రెస్ ఎన్నికల ఇన్చార్జిలు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. త్వరలో సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచార సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ ఇటు మెదక్, అటు జహీరాబాద్ రెండు లోక్ సభ నియోజకవర్గాలకు కలిపి ఆందోల్ మండలం సుల్తాన్‌పూర్‌లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. దీనికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్హాజరయ్యారు. నామినేషన్ల చివరి రోజు మెదక్ పట్టణంలో నిర్వహించిన రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు.
బీజేపీ మెదక్‌లో గోవా సీఎం ప్రమోద్ సావంత్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ, ప్రచార సభ నిర్వహించగా, సిద్దిపేటలో ప్రచార సభకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హాజరయ్యారు. మెదక్, జహీరాబాద్లోక్సభ నియోజకవర్గాలకు కలిపి ఈనెల 30న మెదక్ జిల్లా అల్లాదుర్గంలో నిర్వహించే ఎన్నికల ప్రచార బహిరంగ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, బహిరంగ సభలు మూడు ప్రధాన పార్టీల క్యాడర్లో జోష్ నింపుతున్నాయి. పోలింగ్‌తేదీ సమీపిస్తుండడంతో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.