బాలికపై అత్యాచారం.. నిందితుడి ఇంటికి నిప్పు

  • ఆదిలాబాద్  జిల్లా గుడిహత్నూర్‌‌‌‌‌‌‌‌  మండల కేంద్రంలో ఉద్రిక్తత

గుడిహత్నూర్, వెలుగు: బాలికపై అత్యాచారం చేశాడంటూ నిందితుడి ఇంటికి స్థానికులు నిప్పు పెట్టారు. ఆదిలాబాద్‌‌‌‌  జిల్లా గుడిహత్నూర్‌‌‌‌  మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో శనివారం ఈ ఘటన జరిగింది. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఓ బాలిక శనివారం బడి నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వాకబు చేశారు. దీంతో అదే కాలనీకి చెందిన, ఒంటరిగా ఉంటున్న చట్ల పోశెట్టి (23) అనే యువకుడి ఇంట్లో బాలిక ఉన్నట్టు కుటుంబ సభ్యులు గమనించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.  ఎస్సై మహేందర్‌‌‌‌  హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి తలుపులు తెరిపించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

అప్పటికే మద్యం మత్తులో ఉన్న పోశెట్టిని తరలించే ప్రయత్నం చేస్తుండగా బాలిక బంధువులు అడ్డుకున్నారు. పోశెట్టిని తమకు అప్పగించాలని ఆందోళన చేశారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్సై మహేందర్‌‌‌‌.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఇచ్చోడ సీఐ భీమేశ్, ఎస్సై తిరుపతి ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, ఆందోళనకారులలో కొందరు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో సీఐ భీమేశ్  తలకు తీవ్రగాయం కాగా, ఇచ్చోడ ఎస్సై తిరుపతి కాలికి కూడా గాయమైంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. వెంటనే నిందితుడిని అక్కడి నుంచి తరలించారు.