బంగారాన్ని ఎగబడి తాకట్టు పెడుతున్న జనం : ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబాలు

నగరాల్లో జీవనం సాగిస్తూ చాలీచాలని జీతాలతో బతుకు బండి నెట్టుకొచ్చే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా లోన్లపై ఆధారపడుతుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ లోన్లే ఆదుకుంటుంటాయి. లక్షల్లో రుణాలు తీసుకుని వాటికి ఈఎంఐలు కట్టడంతోనే మధ్యతరగతి ప్రజల సగం జీవితం తెల్లారిపోతుంటుంది. బ్యాంకులిచ్చే ఈ రుణాలు చాలా రకాలుగా ఉంటాయి. పర్సనల్ లోన్, హోం లోన్, కారు లోన్, గోల్డ్ లోన్.. ఇలా ఎవరి అవసరానికి తగిన లోన్ వారు తీసుకుంటూ ఉంటారు. తాజాగా.. గోల్డ్ లోన్ల గురించి తెలిసిన కొత్త విషయం ఏంటంటే.. ఇండియాలో బ్యాంకులు ఇచ్చే గోల్డ్ లోన్లకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఏడు నెలల్లో గోల్డ్ లోన్లు 50.4 శాతం పెరిగాయని ఆర్బీఐ తెలిపింది.

సెక్టోరల్ డిప్లాయ్మెంట్ ఆఫ్ బ్యాంక్ క్రెడిట్ డేటాను శుక్రవారం వెల్లడించిన సందర్భంలో ఆర్బీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. అక్టోబర్ 18, 2024 నాటికి మన దేశంలోని గోల్డ్ లోన్ బకాయిలు రూ.1,54,282 కోట్లు. మార్చి 2024 నాటికి ఈ మొత్తం బకాయిలు రూ.1,02,562 కోట్లు. అక్టోబర్ 2023లో కేవలం 13 శాతం మాత్రమే గోల్డ్ లోన్లలో వృద్ధి కనిపించగా, ఈ సంవత్సరం ఏకంగా గోల్డ్ లోన్లలో వృద్ధి 56 శాతానికి చేరింది. భారత్లో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం తరహా పరిస్థితులు ఉన్నాయని, గోల్డ్ లోన్లకు ఈ స్థాయిలో డిమాండ్ పెరగడమే ఇందుకు సంకేతమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. బ్యాంకులిచ్చే ఇతర లోన్లపై వడ్డీతో పోల్చితే గోల్డ్ లోన్లపై వడ్డీ తక్కువగా ఉంటుంది.

ALSO READ : చైనాలో టన్నుల్ టన్నులే బంగారం.. దాని విలువ తెలిస్తే షాక్!

గోల్డ్ లోన్లను బ్యాంకులు త్వరగా అఫ్రూవ్ చేస్తాయి. మనం తీసుకునే పర్సనల్ లోన్ల వల్ల క్రెడిట్ స్కోర్పై ప్రభావం ఉంటుంది. గోల్డ్ లోన్ల వల్ల క్రెడిట్ స్కోర్పై ఎలాంటి ప్రభావం ఉండదు. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం.. బ్యాంకులు గానీ, ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గానీ గోల్డ్ వ్యాల్యూపై 90 శాతం వరకూ రుణం మంజూరు చేయొచ్చు. కనిష్టంగా ఆరు నెలల నుంచి గరిష్టంగా రెండేళ్ల వరకూ గోల్డ్ లోన్ చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో, ఆపద కాలంలో ఇంట్లో ఉన్న బంగారాన్ని కుదువ పెట్టి గోల్డ్ లోన్లు తీసుకుంటుంటారు.