చేప పిల్లల పంపిణీ పై నీలి నీడలు

  • ఉత్తర్వులు జారీ చేయని కమిషనర్
  • పథకం అమలుపై స్పష్టత కరువు

సిద్దిపేట, వెలుగు :  మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం  చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో ఉచిత చేప విత్తనాల పంపిణీ పథకంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. జూన్ సమీపిస్తున్నా ఇంత వరకు చేప పిల్లల పంపిణీ పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అసలు ఈ పథకం ఈ ఏడాది ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జూన్ ప్రారంభం నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తై వర్షాలు ప్రారంభం కాగానే చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో చేప, రొయ్య పిల్లలను ఉచితంగా వదిలే పథకం ఎనిమిదేండ్లుగా మత్స్య శాఖ ఆధ్వర్యంలో  ప్రభుత్వం నిర్వహిస్తోంది.

ఏప్రిల్​, మే నెలల్లో చేప విత్తనాల సరఫరా కోసం టెండర్ల ప్రక్రియను నిర్వహించగానే మత్స్య శాఖ అధికారులు ఆయా జిల్లాల్లో  చేప పిల్లలు వదిలే చెరువులు , కుంటలు, రిజర్వాయర్లను  ఖరారు చేస్తారు.  సకాలంలో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోక పోవడంతో పాటు పార్లమెంటు ఎన్నికల కోడ్​అమల్లోకి రావడంతో అసలు ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది నిర్వహిస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎనిమిదేళ్లుగా జూన్ మొదటి వారం వరకు టెండర్ల  ప్రక్రియను పూర్తి  చేసి జూలై నుంచి సెప్టెంబరు వరకు  జలాశయాల్లో చేప, రొయ్య విత్తనాలను మత్స్య శాఖ అధికారులు సొసైటీల సహకారంతో  వదులుతూ వస్తున్నారు. సకాలంలో చేప విత్తనాల్ని వదలకుంటే ఆశించన మేర పెరిగే అవకాశం ఉండదని మత్స్య కారులు పేర్కొంటున్నారు.

1500 చెరువుల్లో  చేప విత్తనాలు

సిద్దిపేట జిల్లాలో ఎనిమిదేళ్లుగా 1500 చెరువులు, కుంటల్లో చేప విత్తనాలను వదులుతున్నారు. జిల్లాలో  357 మత్స్యకార సొసైటీల్లో 25,018 మంది సభ్యులున్నారు. సిద్దిపేట జిల్లాలో 1500 చెరువులు, కుంటలు,  రంగనాయకసాగర్, మల్లన్న సాగర్, కొండ పొచమ్మ సాగర్ రిజర్వాయర్ల  తోపాటు మరో 6 మినీ రిజర్వాయర్లలో చేప, రొయ్య విత్తనాలను వదులుతున్నారు.

గతేడాది 4.29 కోట్ల చేప, 50 లక్షల రొయ్య విత్తనాలను జలశయాల్లో వదిలారు. గతేడాది టెండర్ల ప్రక్రియ కొంచెం ఆలస్యమైనా నిర్ణీత గడువు వరకు చేప , రొయ్య విత్తనాలను వదలడం వల్ల మత్స్యకారులకు ఆర్థికంగా ఎంతో లాభం జరిగింది.

పథకం కొనసాగింపు పై క్లారిటీ

ఈ ఏడాది  ఉచితంగా చేప, రొయ్య విత్తనాలను పంపిణీ చేసే విషయంలో ప్రభుత్వం సకాలంలో నిర్ణయం తీసుకోక పోవడమే ఈ పరిస్థితి కారణమని మత్స్యకారులు పేర్కొంటున్నారు. కొత్తగా  ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కుదురుకునే లోపు పార్లమెంట్​ఎన్నికల కోడ్ రావడంతో దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. పరిస్థితులను గమనించి మత్స్య శాఖ ఉన్నతాధికారులు సైతం ముందస్తుగా దీనిపై ముందస్తుగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

టెండర్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోవడంతో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతనైనా నిర్ణయం తీసుకుంటే మత్స్య కారులకు లాభం చేకూరే అవకాశం ఉంది. ఏమాత్రం ఆలస్యం చేసినా ఈ పథకానికి బ్రేక్ పడినట్టేనని మత్స్య కారులు భావిస్తున్నారు.

ప్రభుత్వ ఆదేశాలు రాగానే  టెండర్ల ప్రక్రియ

ఉచిత చేప విత్తనాల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. జిల్లాలో శాఖాపరమైన ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి పంపించాం. ఎన్నికల కోడ్ వల్ల ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని భావిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే చేప విత్తనాలపై  టెండర్లను ఆహ్వానించడానికి ఏర్పాట్లు చేస్తాం. జిల్లాలో దాదాపు 1500 జలాశయాల్లో నాణ్యమైన చేప విత్తనాలను పంపిణీ చేస్తాం.  

మల్లేశం, జిల్లా మత్స్య శాఖ అధికారి