నిందితుడిని ఉరి తీయాలె

తిర్యాణి/కాగజ్ నగర్/జైనూర్, వెలుగు : జైనూర్ మండలంలో ఆదివాసీ మహిళపై అత్యాచారంయత్నం, హత్యాయత్నం చేసిన నిందితుడిని ఉరితీయాలని బుధవారం తిర్యాణి మండల కేంద్రంలోని కుమ్రం భీం చౌరస్తా ముందు ఆదివాసీ సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఘటనకు నిరసనగా గురువారం మండలంలో బంద్​కు పిలుపునిచ్చామని.. వ్యాపార, ఇతర దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. మహిళకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామన్నారు. 

తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి భగవంత రావు, ఆదివాసీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిందితుడిని వెంటనే ఉరితీయాలని బెజ్జుర్ మండల ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఆదివాసీ భవనంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిందితుడిని వెంటనే ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుకు అప్పగించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పెసా అధ్యక్షుడు కొడప విశ్వేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

కఠినంగా శిక్షించాలి : కోవా లక్ష్మి

ఆదివాసీ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే కోవా లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని బుధవారం ఎమ్మెల్యే పరామర్శించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆదివాసీలపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో శాంతిభద్రతలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

వదంతులను నమ్మొద్దు

ఆదిలాబాద్, వెలుగు : జైనూర్ ఘటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, ప్రజలు సంయమనం పాటించాలని ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం ఓ ప్రకటనలో వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని కోరారు. జైనూర్ లో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఇతరులు అక్కడికి వెళ్లడానికి అనుమతి లేదన్నారు. 

పోలీసు యంత్రాంగం కేసులను నమోదు చేసిందని, దర్యాప్తు కొనసాగుతుందని, కారకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వదంతులు ప్రచారం చేస్తూ మతాల మధ్య చిచ్చుపెట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.