లింగాపూర్ ఫారెస్ట్​లో ఆగని చెట్ల నరికివేత

  • పోడు కోసం భూమిని చదును చేసుకుంటున్న గిరిజనులు
  • కౌన్సెలింగ్ ఇచ్చి, నచ్చజెప్పిన అధికారులు

దండేపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్​లో భూ పోరాటం మళ్లీ మొదలైంది. నెల రోజుల్లో రెండు చోట్ల మూడుసార్లు చెట్లను కొట్టి, పోడు వ్యవసాయం కోసం గిరిజనులు భూమిని చదును చేసుకున్నారు. తాజాగా లింగాపూర్ బీట్ 380 కంపార్ట్ మెంట్​లో సమీప గూడెల ఆదివాసి గిరిజన మహిళలు శనివారం చెట్లను నరికివేశారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ డిప్యూటీ ఆఫీసర్ పోషమల్లు సిబ్బందితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. చెట్లను నరకవద్దని ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ అధికారులను పిలిపించారు.

దీంతో లక్షెట్టిపేట సీఐ అల్లం నరేందర్, తహసీల్దార్ సంధ్యారాణి, దండేపల్లి, లక్షెట్టిపేట ఎస్ఐలు ఉదయ్ కిరణ్, సతీశ్ కుమార్, తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుష్మరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రిజర్వ్ ఫారెస్ట్​లో చెట్లు నరికి కేసుల పాలుకావొద్దని, చట్టపరంగా భూములు కావలసిన వారు రెవెన్యూ ఆఫీసర్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి నచ్చజెప్పడంతో వెనక్కి తగ్గారు.