మీర్జాపూర్​లో నాటుబాంబు కలకలం

  •     యువకుడికి తీవ్ర గాయాలు

హుస్నాబాద్​, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ మండలం మీర్జాపూర్​లో నాటుబాంబు పేలి యువకుడికి తీవ్ర గాయాలవడం కలకలం రేపింది. సోమవారం  గ్రామానికి చెందిన ఖలీల్ పశువులను మేపేందుకు పొలం వద్దకు తీసుకెళ్లాడు. వాటిని తాళ్లతో కట్టేసి ఉంచేందుకు భూమిలోకి మేకు కొడుతుండగా నాటుబాంబు పేలినట్టు స్థానికులు తెలిపారు. ఈఘటనలో ఖలీల్ చేతితో పాటు కాలుకు గాయాలయ్యాయి. వెంటనే ఆయనను వరంగల్ ఎంజీఎంకు తరలించారు.

సమాచారం తెలుసుకున్న ఏసీపీ సతీశ్​ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ నాటు బాంబులు అడవి పందులను వేటాడేందుకు వేటగాళ్లు పెట్టిన ఉచ్చుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రెండేండ్ల కింద హుస్నాబాద్​లోని ఆర్టీసీ బస్టాండ్​లో ఇలాగే నాటుబాంబులు పేలాయి. అడవిజంతువుల వేటగాళ్లు ఇలా నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ బాంబులు పెడుతుండడం ప్రాణాలమీదకు తెస్తోంది.