- అధికారంలోకి వచ్చాక ప్రత్యేక దృష్టి పెట్టిన కాంగ్రెస్
- భూ సేకరణ, విస్తరణ పనులు స్పీడప్
- ఆరు నెలల్లో 1,500 ఎకరాల సేకరణ
- హ్యుందాయ్, వెమ్ టెక్ ఫ్యాక్టరీలకు కేటాయింపులు
- 269 మంది రైతులకు చెక్కులు అందజేత
సంగారెడ్డి, వెలుగు : జాతీయ పారిశ్రామిక ఉత్పాదక మండలి (నిమ్జ్) పనులు ఊపందుకున్నాయి. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం, న్యాల్కల్ మండలాల పరిధిలోని మొత్తం17 గ్రామాల పరిసరాల్లో 500 కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం రూ.31 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా, మూడు లక్షల మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అయితే, ఏడేండ్లలోనే నిమ్జ్పూర్తి చేయాల్సి ఉన్నా, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అది సాధ్యం కాకపోగా ఇంకా భూ సేకరణ స్థాయిలోనే పనులు నడుస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం 12,635 ఎకరాలు అవసరముండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కేవలం 3,500 ఎకరాలు మాత్రమే సేకరించగలిగారు. పనుల పర్యవేక్షణ కోసం స్పెషల్‌డిప్యూటీ కలెక్టర్‌ను నియమించినా గత సర్కారు ఆసక్తి చూపకపోవడంతో భూసేకరణ దశను దాటలేదు.
నిమ్జ్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఫోకస్
గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక నిమ్జ్ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక దృష్టి పెట్టడంతో గడిచిన ఆరు నెలల్లోనే జాతీయ స్థాయిలో పెట్టుబడులతో పాటు భూసేకరణ పనులు వేగం పుంజుకున్నాయి. భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లింపుల్లో గత ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించగా, మంత్రి దామోదర రాజనర్సింహ చొరవ తీసుకుని ఇటీవల ఝరాసంగం మండలం ముంగి గ్రామంలో 500 ఎకరాలకు సంబంధించిన 269 మంది రైతులకు రు.22.70 కోట్ల పరిహారం చెక్కులు అందజేశారు. ఇలా గడిచిన ఆరు నెలల్లోనే కాంగ్రెస్ప్రభుత్వం సుమారు 1,500 ఎకరాలను సేకరించింది. దీంతో కలుపుకొని ఇప్పటివరకు మొత్తం ఐదు వేల ఎకరాలు సేకరించామని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు సేకరించిన భూముల్లో ఇప్పటికే హ్యుందాయ్కంపెనీకి 109 ఎకరాలు, వెమ్ టెక్ ఫ్యాక్టరీకి 511 ఎకరాలు కేటాయించారు.
స్థానికులకు ఉపాధి
నిమ్జ్పనులు పూర్తయితే స్థానికులైన దాదాపు మూడు లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ప్రత్యక్షంగా రెండు లక్షలు..పరోక్షంగా లక్ష మందికి ఉపాధి మార్గం చూపనున్నారు. సంగారెడ్డితోపాటు చుట్టుపక్కల జిల్లాల నిరుద్యోగులు ఉపాధి కోసం ఇంతకాలం హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళ్లేవారు. ఇప్పుడు అలా వెళ్లే వారు ఆగడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వారు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అలాగే, పరిశ్రమల ఉత్పత్తులకు అనుగుణంగా స్థానికులకు స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ఇచ్చి ఉద్యోగాలివ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు నిమ్జ్ప్రాజెక్టు పూర్తి కాకముందే తమ భూముల ధరలు పెరిగాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు రూ.20 లక్షలు కూడా పలకని ఎకరం ఇప్పుడు కోటి రూపాయలకు పైనే పలుకుతోందని సంబురపడుతున్నారు. నిమ్జ్పనుల పర్యవేక్షణ కోసం జహీరాబాద్ లో ప్రత్యేక ఆఫీస్ కూడా ఏర్పాటు చేశారు.
జహీరాబాద్ కు గుర్తింపు
నిమ్జ్ప్రాజెక్టు వల్ల జహీరాబాద్ ప్రాంతానికి జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది. ఇది అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ఉండాలి. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. 12 ఏండ్ల నిరీక్షణకు కాంగ్రెస్ప్రభుత్వంలో తెర పడుతుందన్న నమ్మకం ఉంది. భూ సేకరణ పనులు ఇంకా వేగవంతం చేసి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం అందరికీ పరిహారం ఇవ్వాలి.
వేణుగోపాల్ రెడ్డి (బర్దిపూర్)
శిక్షణ ద్వారా ఉద్యోగం ఇవ్వాలి
పరిశ్రమల ఉత్పత్తులకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలివ్వాలి. జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎంతోమంది ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా ఉన్నారు. వారి అర్హతలకు తగ్గట్టు ఉపాధి చూపించాలి. మొదట స్థానికులకు అవకాశం ఇచ్చాకే, తర్వాత స్థానికేతరులకు ఉద్యోగాలివ్వాలి. నిమ్జ్ప్రాజెక్టు నిరుద్యోగులకు వరం లాంటిది. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.
- పండరీనాథ్ (బర్దిపూర్)