- సెంట్రల్ డ్రగ్ స్టోర్అధికారుల నిర్లక్ష్యం
- జాగా లేక రిమ్స్ ఆడిటోరియంలో స్టోరేజీ
- నాశనం చేస్తున్న మూషికాలు
ఆదిలాబాద్ టౌన్, వెలుగు : ఫొటోల్లో వృథాగా పడి ఉన్న మందులు, సెలైన్లు, సూదులు ఏదో చెత్త డంపింగ్‌యార్డులో ఉన్నవి కావు. సాక్షాత్తు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆడిటోరియంలో స్టోర్ చేసినవి. వీటి విలువ సుమారు రూ.లక్షల్లో ఉంటుంది. ఇవి సెంట్రల్ డ్రగ్ స్టోర్ కు సంబంధించినవి. వీటిని రిమ్స్ తో పాటు జిల్లాలోని పీహెచ్‌సీలకు, గవర్నమెంట్ హాస్పిటల్ లకు సరఫరా చేస్తుంటారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో స్థలం సరిపోని కారణంగా రిమ్స్ ఆడిటోరియంలో నిల్వ ఉంచారు.
ఈ నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉండగా ఆ పని ఎవ్వరూ చేయడం లేదు. దీంతో ఎలుకలు మెడిసిన్ బాక్స్‌లను ఓపెన్ చేసి అందులోని విలువైన యాంటీ బయాటిక్స్, ఇతర మెడిసిన్ స్ట్రిప్స్‌తో పాటు ఐవీ ఫ్లూయిడ్స్బాటిల్స్, ఇంజక్షన్స్‌ను కొరికి నాశనం చేస్తున్నాయి. దీంతో ఆడిటోరియం చెత్త డంపింగ్‌యార్డును తలపిస్తోంది. ఈ విషయమై సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ ఇన్చార్జి విఠల్ వివరణ కోరగా తమ దగ్గర స్థలం సరిపోకపోవడం వల్లే రిమ్స్ ఆడిటోరియంలో మందులను పెట్టామని, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉంది.