ఉద్యోగం రెగ్యులరైజ్‌‌‌‌ కాలేదన్న బాధతో..ల్యాబ్ టెక్నీషియన్‌‌‌‌ సూసైడ్‌‌‌‌

  • ఆత్మహత్యకు జీవో 510 కారణమంటూ సూసైడ్ నోట్‌‌‌‌

నిర్మల్, వెలుగు : ఉద్యోగం రెగ్యులరైజ్‌‌‌‌ కాకపోవడం, జీతం పెరగడం లేదన్న బాధతో ఓ ల్యాబ్‌‌‌‌ టెక్నీషియన్‌‌‌‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు గత ప్రభుత్వం జారీ చేసిన 510జీవోనే కారణమ ని సూసైడ్‌‌‌‌ నోట్ రాశాడు. ఈ ఘటన నిర్మల్‌‌‌‌ పట్టణంలో సోమవారం జరిగింది. నిర్మల్‌‌‌‌కు చెందిన వకులాభరణం భరత్‌‌‌‌ (37) 2018లో కాంట్రాక్ట్‌‌‌‌ పద్ధతిలో ఆర్‌‌‌‌ఎన్టీపీసీ విభాగం సీనియర్‌‌‌‌ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ల్యాబ్‌‌‌‌ టెక్నీషియన్‌‌‌‌గా జాబ్‌‌‌‌ సాధించాడు. అయితే 510 జీవో కారణంగా ఉద్యోగం రెగ్యులరైజ్‌‌‌‌ కాకపోవడం, తన కన్నా జూనియర్లు ఎక్కువ జీతం తీసుకుంటుండడంతో మనస్తాపానికి గురయ్యాడు.

ఇటీవల జీవో నంబర్‌‌‌‌ 16ను కూడా అమలు చేయొద్దంటూ ఉత్తర్వులు రావడంతో మరింత కుంగిపోయాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన అతడి తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, రెండేండ్ల కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

510 జీవో కారణమంటూ సూసైడ్‌‌‌‌ నోట్‌‌‌‌

గత ప్రభుత్వం జారీ చేసిన 510 జీవో కారణంగానే తనకు అన్యాయం జరిగిందని భరత్‌‌‌‌ సూసైడ్‌‌‌‌ నోట్‌‌‌‌లో పేర్కొన్నాడు. ‘నా భార్య పల్లవికి అన్యాయం చేస్తున్నాను, కొడుకు దేవాను వీడి పోతున్నాను.. మీ ఇద్దరినీ బాగా చూసుకుంటానని కలలు కన్నాను.. కానీ ఉద్యోగం రెగ్యులరైజ్‌‌‌‌ కాకపోవడంతో మీకు చెప్పినట్లుగా ముందుకు వెళ్లలేకపోయాను’ అని లెటర్‌‌‌‌లో పేర్కొన్నాడు. తాను పని చేసిన కాలానికిగానూ రావాల్సిన పీవోఎల్‌‌‌‌ బకాయిలను తనభార్యకు ఇవ్వాలని కోరాడు.

అలాగే తన ఆత్మహత్యతోనైనా మిగతా కాంట్రాక్ట్‌‌‌‌ సీనియర్‌‌‌‌ ల్యాబ్‌‌‌‌ టెక్నీషియన్లకు న్యాయం జరిగేలా చూడాలని 3194 ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్‌‌‌‌గౌడ్‌‌‌‌ను కోరారు. అలాగే ‘అమ్మా, నాన్న సారీ.. నా సహచర ఉద్యోగులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలందరికీ రుణపడి ఉంటాను’ అంటూ ఆ లెటర్‌‌‌‌లో రాశారు. సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్‌‌‌‌ భరత్‌‌‌‌ మృతితో వైద్య ఆరోగ్యశాఖలో విషాదం నెలకొంది.