- ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నంపై ఆందోళన
- నిందితుడి ఇంటికి నిప్పు, దుకాణాల్లో సామగ్రి దహనం
- స్పెషల్ బలగాలను మోహరించిన పోలీసులు
- బాధితురాలిని గాంధీ ఆస్పత్రిలో పరామర్శించిన మంత్రి సీతక్క
జైనూర్/ ఆసిఫాబాద్/పద్మారావునగర్, వెలుగు : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆదివాసీ మహిళపై గత నెల 31న జరిగిన లైంగిక దాడి ఘటనపై జైనూరు ఏజెన్సీకి చెందిన ఆదివాసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగపూర్, సిర్పూర్ యూ మండలాల నుంచి సుమారు 500 మంది ఆదివాసీలు బుధవారం జైనూరుకు తరలివచ్చి ఆందోళనకు దిగారు. నిందితుడి ఇంటిని ధ్వంసం చేసి తగులబెట్టారు. అతడి వర్గానికి చెందిన వ్యాపారుల దుకాణాలను, ఇండ్లను ధ్వంసం చేశారు.
బంద్ కారణంగా మూసిఉన్న దుకాణాల్లోంచి సామన్లు తీసి రోడ్డుపై వేసి నిప్పు అంటించారు. నిందితుడి వర్గానికి చెందినవారిని ఏజెన్సీ ప్రాంతం నుంచి బయటకు పంపాలని నినాదాలు చేశారు.
అయితే, నిందితుడి వర్గానికి చెందిన వారు కూడా ఆందోళనకు దిగి ఆదివాసీల దుకాణాలను ధ్వంసం చేశారు. దీంతో ఇరువర్గాలకు చెందిన సుమారు 20 షాపులు ధ్వంసమయ్యాయి. ఒక ప్రార్థనాస్థలంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా.. డీఎస్పీ సదయ్య ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్పెషల్ పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. ఆదివాసీ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు ఆటో డ్రైవర్ షేక్ మగ్దూమ్ ను రెండ్రోజుల క్రితమే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.
నిందితుడికి కఠిన శిక్ష తప్పదు: మంత్రి సీతక్క
ఆదివాసీ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష తప్పదని మంత్రి సీతక్క హెచ్చరించారు. హైదరాబాద్గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితురాలిని బుధవారం మంత్రి పరామర్శించారు. బాధితురాలికి మెరుగైన ట్రీట్మెంట్అందించాలని డాక్టర్లను ఆదేశించారు. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు.
అలాగే, ఆస్పత్రి నుంచే ఆసిఫాబాద్ఎస్పీతో ఫోన్లో మాట్లాడి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఆదివాసీ యువత సంయమనంతో ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలని కోరారు. బాధితురాలికి కచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. భవిష్యత్తులో ఏజెన్సీ ప్రాంతాలలో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
ఆదివాసీలు సంయమనం పాటించాలి : కలెక్టర్
ఆదివాసీలు, యువత సంయమనం పాటించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఒక ప్రకటనలో కోరారు. బాధితురాలికి మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నామని, ప్రభుత్వం తరఫున సహాయం అందించి న్యాయం జరిగేలా చూస్తామని కలెక్టర్ తెలిపారు.
ఖమ్మంలో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
అడిషనల్ డీజీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినతి
హైదరాబాద్, వెలుగు : ఖమ్మంలో తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు కోరారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో అడిషనల్ డీజీ మహేశ్ భగవత్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందనడానికి ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై జరిగిన దాడులే నిదర్శనమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లో ఖమ్మంలో బీఆర్ఎస్పై దాడి జరిగిందని ఆరోపించారు.
వరద బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుండటాన్ని సీఎం ఓర్చుకోలేకే రౌడీ షీటర్లను పురమాయించారని విమర్శించారు. ఈ దాడిని సీఎం కార్యాలయం పర్యవేక్షించిందని, దాడిలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలకు పోలీసులు అండగా నిలిచారని తెలిపారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించిన తీరును మహేశ్ భగవత్ కు వివరించామని చెప్పారు. దాడులకు పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరామన్నారు.