కుమ్రం భీం 84వ వర్ధంతి

  • కెరమెరి మండలం జోడేఘాట్ లో నివాళులు అర్పించనున్న ఆదివాసీలు
  • దర్బార్ కు ఏర్పాట్లు పూర్తి చేసిన ఐటీడీఏ ఆఫీసర్లు

ఆసిఫాబాద్, వెలుగు: జల్, జంగల్, జమీన్  నినాదంతో అడవి బిడ్డల స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం నిజాం సర్కారును ఎదురించి అమరుడైన గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రం భీం 84వ వర్ధంతిని గురువారం ఆసిఫాబాద్  జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్ లో నిర్వహించనున్నారు. ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గిరిజన సాంప్రదాయాలతో వర్ధంతి జరగనుంది. ఉదయం కుమ్రంభీం మనుమడు కుమ్రం సోనేరావు, వారసులు, కుటుంబ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమాధి వద్ద  ఐదు గోత్రాల జెండాలను ఎగురవేసి, సమాధి వద్ద సాంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు హాజరై గిరిజన పోరాటయోధుడికి  నివాళులు అర్పిస్తారు. ఈ సందర్భంగా జరిగే గిరిజన దర్బార్ లో మంత్రులు, అధికారులు పాల్గొని ఆదివాసీల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. వివిధ శాఖల అధికారులు సందర్శకుల కోసం స్టాళ్లను ఏర్పాటు చేయడంలో బిజీగా ఉన్నారు. హెలిప్యాడ్  సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే గిరిజనుల కోసం ఐటీడీఏ ఆఫీసర్లు ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రత్యేక బస్సులు, భోజనం, తాగునీరు, పార్కింగ్  వంటి సౌలతులను కల్పిస్తున్నారు.

భారీ బందోబస్తు..

గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో వర్ధంతి సందర్భంగా జోడేఘాట్  అటవీ ప్రాంతాన్ని పోలీసులు తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. ఇప్పటికే జోడేఘాట్  వెళ్లే మార్గాన్ని మెటల్  డిటెక్టర్లతో తనిఖీ చేశారు. వర్ధంతి జరిగే ప్రాంగణాన్ని తనిఖీ చేస్తున్నారు. ఎస్పీ డీవీ శ్రీనివాస రావు పర్యవేక్షణలో ఒక అడిషనల్  ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 28 మంది ఎస్ఐలతో పాటు 460 మంది పోలీస్  అధికారులు, సిబ్బంది బందోబస్తు కోసం కేటాయించారు. ఆసిఫాబాద్ జిల్లాతో పాటు రామగుండం కమిషనరేట్, భూపాలపల్లి, జగిత్యాల, ములుగు జిల్లాల పోలీస్  అధికారులు, సిబ్బంది బందోబస్తులో పాల్గొననున్నారు.