జనవరి 5 నుంచి నీటిని విడుదల చేస్తాం : బొజ్జు పటేల్​

  • రైతులతో ముఖాముఖిలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్​

కడెం, వెలుగు: రబీ పంటకు ప్రతి రైతుకు సాగునీరు అందిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. రబీ సాగునీటి సరఫరాపై ఇరిగేషన్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో గురువారం కడెం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఖానాపూర్, కడెం, దస్తురాబాద్, జన్నారం రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు.

పదేండ్లు పాలించిన బీఆర్​ఎస్​కడెం ప్రాజెక్టు రిపేర్లకు చిల్లిగవ్వ ఇవ్వలేదని, ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో కడెం ప్రాజెక్టు రిపేర్లకు ప్రభుత్వం రూ.9.46 కోట్లు మంజూరు చేసిందన్నారు. 

రిపేర్ల తర్వాత ప్రాజెక్టు సురక్షితంగా ఉందన్నారు. ఖానాపూర్, కడెం దస్తురాబాద్, జన్నారం రైతుల పంట సాగుకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, జనవరి 5 నుంచి నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. 

తప్పుడు సమాచారంతో కొందరు ప్రభుత్వంపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మొద్దని కోరారు. ఇరిగేషన్ శాఖ అధికారులు, డీఈ నవీన్, జెఈలు నితిన్, విశాల్, మురళీకృష్ణ, శ్రావణి, ప్రజా ప్రతినిధులు, జిల్లా కాంగ్రెస్ నేత సతీశ్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రమేశ్, రమేశ్ వర్మ, తుమ్మల మల్లేశ్, పడిగెల భూషణ్ తదితరులు పాల్గొన్నారు.