కడెం, వెలుగు: రైతును రాజు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం కడెం ప్రాజెక్ట్ నీటిని అధికారులు,స్థానిక నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్లోకి వెళ్లిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.9.42 లక్షల నిధులు మంజూరు చేసి పూర్తిస్థాయిలో రిపేర్లు చేయించినట్లు చెప్పారు.
మాజీ మంత్రి కేటీఆర్కు కడెం ప్రాజెక్ట్ ఎక్కడుందో కూడా తెలియకపోవడం విడ్డూరమన్నారు. కడెం ప్రాజెక్ట్ నీటి ద్వారా కొన్ని వేల ఎకరాలకు సాగు నీరు అందబోతుందని, రైతులు దిగులు చెందకుండా రెండు పంటలు సాగుచేయొచ్చని తెలిపారు. ప్రాజెక్టు ఎస్ఈ రవీందర్, ఈఈ విఠల్, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుల సత్యం, కడెం మాజీ ఎంపీపీ అలెగ్జాండర్, జిల్లా యూత్ అధ్యక్షుడు సతీశ్ రెడ్డి, మండల అధ్యక్షుడు మల్లేశ్ యాదవ్, జిల్లా అధ్యక్షురాలు దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు..
-
రెంకోని వాగును పరిశీలించిన ఎమ్మెల్యే
ఖానాపూర్: భారీ వర్షాలకు ఖానాపూర్ మండలంలోని దిలావర్ పూర్ వెళ్లే గాంధీ నగర్ సమీపంలోని రెంకోని వాగుపై తాత్కాలిక రోడ్డు శనివారం రాత్రి కొట్టుకుపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జు కాంగ్రెస్ నాయకులతో కలసి అదివారం వాగును పరిశీలించారు.
వెంటనే తాత్కాలిక రోడ్డు నిర్మించాలని, అప్పటివరకు ప్రజలెవరూ ఈ మార్గం వైపు వెళ్లకుండా చూడాలని అర్అండ్బీ అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ చిన్నం సత్యం, కావలి సంతోష్, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు దయానంద్, రమేశ్, కౌన్సిలర్లు, అధికారులున్నారు.