గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కృషి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

  • ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఖానాపూర్, వెలుగు: గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గల్ఫ్ దేశాల్లో చనిపోయిన కార్మిక కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఉత్తర్వులు జారీచేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు క్షీరాభిషేకం చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ సర్కార్ పదేండ్ల పాటు అధికారంలోకి ఉండి గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. 

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ చిన్నం సత్యం, కావలి సంతోష్, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దయానంద్, నిమ్మల రమేశ్, గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు షబ్బీర్ పాషా, నాయకులు పరిమి సురేశ్, తోట సత్యం, జహీర్, ఆసిఫ్ అలీ, పలువురు లీడర్లు, గల్ఫ్ కార్మికుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

గౌడన్నల అభివృద్ధికి ప్రభుత్వం కృషి ..

ప్రభుత్వం గౌడన్నల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తోందని బొజ్జు పటేల్ అన్నారు. ఖానాపూర్​లోని ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయంలో 100 మంది గౌడన్నలకు వృత్తి పనిముట్లను రాష్ట్ర మత్స్య శాఖ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తో కలిసి అందజేశారు. సబ్బండ వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. నిర్మల్ ఎక్సైజ్ శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, గౌడ కులస్తులు పాల్గొన్నారు.