యాసంగి సాగుకు నీటి విడుదల : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఖానాపూర్/కడెం/దండేపల్లి, వెలుగు: రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. ఖానాపూర్, కడెం మండలాల రైతులకు యాసంగి పంటల సాగు కోసం ఖానాపూర్ మండలం మేడంపల్లి వద్ద ఉన్న సదర్ మాట్ ఆనకట్ట నుంచి కుడి, ఎడమ కాల్వలకు ఆదివారం నీటిని విడుదల చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రబీ సీజన్​లో సదర్​మాట్ ఆనకట్ట పరిధిలోని చివరి ఆయకట్టు వరకు రైతులకు పూర్తిస్థాయిలో సాగు నీరు అందిస్తామన్నారు.

రైతుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. త్వరలోనే సదర్ మాట్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ చిన్నం సత్యం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నిమ్మల రమేశ్, నాయకులు అబ్దుల్ మాజిద్, తోట సత్యం, యూసుఫ్ ఖాన్, జహీర్, గంగన్న, రాజేశ్వర్ తదితరులు పాల్లొన్నారు. 

హామీలన్నీ నెరవేరుస్తున్నాం..

రైతన్న మేలుకోరే ఏకైక ప్రభుత్వం తమదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని బొజ్జు పటేల్ అన్నారు. కడెం మండలంలోని కడెం ప్రాజెక్ట్ దిగువన రబీ పంట సాగు చేసే పొలాలకు నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కడెం ప్రాజెక్టు రిపేర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.9.46 కోట్లు మంజూరు చేసిందని, పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని పూడికతీతకు పూనుకుందని పేర్కొన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును పట్టించుకోలే దని.. ఏడాదిలోనే ప్రాజెక్టుకు పునర్ వైభవం తీసుకొచ్చామన్నారు. యాసంగిలో 17 వేల ఎకరాలకు నీరందిస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులు సతీశ్ రెడ్డి, రమేశ్, మల్లేశ్, భూషణ్, ప్రాజెక్టు ఈఈ విఠల్, డీఈ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

గూడెం లిఫ్ట్ నుంచి నీటి విడుదల

గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుతో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ నీటిని విడుదల చేశారు. దండేపల్లి మండలం తానిమడుగు డెలివరీ పాయింట్ వద్ద  జలాభిషేకం చేసి మెయిన్ కెనాల్​లోకి నీటిని రిలీజ్ చేశారు. వారు మాట్లాడుతూ ఆయకట్టు చివరి భూములైన హాజీపూర్ మండలం గుడిపేట వరకు నిరంతరాయంగా సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.

గూడెం లిఫ్ట్ ఆయకట్టు కింద దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల రైతుల పంట పొలాలకు సాగు నీరు అందుతుందని అన్నారు. జిల్లా చీఫ్ ఇంజనీర్ బద్రీనారాయణ, డీఈ దశరదం, ఎంపీడీవో జేఆర్ ప్రసాద్, జిల్లా కాంగ్రెస్ గడ్డం త్రిమూర్తి, దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల అధ్యక్షులు ఎ.వెంకటేశ్వర్లు, పి.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.