అదానీకి దెబ్బ మీద దెబ్బ.. రూ.61 వేల కోట్ల డీల్స్ క్యాన్సిల్ చేసుకున్న కెన్యా

నైరోబి: కెన్యా ప్రభుత్వం అదానీ గ్రూప్కు షాకిచ్చింది. సోలార్ పవర్ కాంట్రాక్ట్స్ను దక్కించుకునేందుకు అదానీ గ్రూప్ 265 మిలియన్ డాలర్లు లంచంగా ఇచ్చిందని అమెరికా ప్రాసెక్యూటర్స్ అభియోగాలు చేసి 24 గంటలు కూడా గడవక ముందే అదానీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గౌతమ్ అదానీపై న్యూయార్క్లో అభియోగాలు నమోదు కావడంతో అదానీ గ్రూప్తో చేసుకున్న డీల్స్ ను కెన్యా ప్రభుత్వం రద్దు చేసుకుంది.

అదానీ గ్రూప్ తో కెన్యా రెండు కీలక ఒప్పందాలు చేసుకుంది. అందులో ఒకటి ఎయిర్పోర్ట్కు సంబంధించిన డీల్ కాగా, మరొకటి ఎనర్జీ డీల్. ఈ రెండు డీల్స్ ను తక్షణమే రద్దు చేయాలని కెన్యా అధికార యంత్రాంగానికి ఆ దేశ అధ్యక్షుడు విలియం రూటో కీలక ఆదేశాలు జారీ చేశారు. నైరోబీలో జోమో కెన్యాట్టా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (JKIA), కెన్యా ప్రభుత్వ ఎలక్ట్రిసిటీ సర్వీసుకు సంబంధించి అదానీ గ్రూప్తో జరిగిన ఒప్పందాలకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కెన్యా అధ్యక్షుడు ఆదేశించారు.

Also Read : ఏపీలో ఆ నెంబర్ వన్ అధికారి ఎవరు

దర్యాప్తు సంస్థలు ఇచ్చిన సమాచారం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిన రూటో అమెరికా పేరును మాత్రం ప్రస్తావించలేదు. అవినీతికి సంబంధించి ఆధారాలుంటే ఎంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికైనా తాను వెనుకాడనని రూటో స్పష్టం చేశారు. కెన్యా ప్రభుత్వం 730 మిలియన్ డాలర్ల డీల్స్ను రద్దు చేసుకోవడంతో అదానీ గ్రూప్కు పుండు మీద కారం చల్లినట్టయింది. అసలే.. అదానీ గ్రూప్ పై వచ్చిన అభియోగాలతో గురువారం నాడు అదానీ గ్రూప్ షేర్లు ఘోరంగా పతనమయ్యాయి. అదానీ గ్రూప్ ఇన్వెస్టర్లు రూ. 2.60 లక్షల కోట్లు నష్టపోయారు.