కేసీఆర్​ దత్తత గ్రామాల్లో  మట్టిపాలైన రూ.45 కోట్లు

  • నిర్వహణ, అవగాహనా లోపంతో ఉమ్మడి సాగు హుష్​!
  • పైలెట్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌గా కేసీఆర్‌‌‌‌‌‌‌‌ దత్తత గ్రామాలైన ఎర్రవెల్లి,  నర్సన్నపేటలో 2019లో ప్రారంభం
  • రెండేండ్లలోనే మూలకుపడ్డ పరికరాలు, పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌లు
  • సొంత బోర్లతోనే  సాగు చేసుకుంటున్న రైతులు

సిద్దిపేట, వెలుగు : రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో 30 సంవత్సరాల్లో జరిగే అభివృద్ధిని ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా పదేండ్లలోనే సాధించాలన్న ఆలోచనతో మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ దత్తత గ్రామాల్లో చేపట్టిన పైలెట్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ విఫలమైంది. సిద్దిపేట జిల్లా మర్కూక్‌‌‌‌‌‌‌‌ మండలం ఎర్రవెల్లి, నర్సన్నపేట ఆదర్శ గ్రామాల్లోని 2,780 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన స్ర్పింకర్ల ఉమ్మడి సాగు నీరుగారిపోయింది. ఆధునిక పద్ధతులతో స్ర్పింక్లర్ల ద్వారా ప్రతి 200 ఎకరాల్లో సమష్టిగా ఒక్కో రకం పంటలను సాగు చేయించాలన్న లక్ష్యం పర్యవేక్షణాలోపంతో ప్రారంభించిన రెండేళ్లలోనే మూలకు పడింది. 

2,780 ఎకరాల్లో ఉమ్మడి సాగు

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 2015లో గజ్వేల్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గం మర్కూక్‌‌‌‌‌‌‌‌ మండలంలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా 2017లో రెండు గ్రామాల్లో స్ర్పింక్లర్ల విధానంలో ఉమ్మడి సాగుకు ప్రణాళిక రూపొందించి, రూ.45 కోట్లు ఖర్చు చేశారు. అయితే ఆశించిన మేర ముందుకు సాగలేదు. తర్వాత 2019లో ప్రత్యేక ప్రాణాళికను రూపొందించారు. ఎర్రవెల్లిలో 1,200 మంది రైతులకు సంబంధించిన 2 వేల ఎకరాలు, నర్సన్నపేటలో 664 మంది రైతులకు సంబంధించిన 780 ఎకరాలు కలిపి మొత్తం 2,780 ఎకరాలకు సంబంధించి 1,864 మంది రైతులకు 100 శాతం రాయితీతో డ్రిప్‌‌‌‌‌‌‌‌ పద్ధతిలో సాగుకు స్ర్పింక్లర్లను పంపిణీ చేశారు.

మూలకుపడిన పరికరాలు, పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌లు

ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ కింద చేపట్టిన ఉమ్మడి సాగుకు సమీపంలోని కూడవెల్లి వాగును అభివృద్ధి చేసి అందులోంచి నీటిని సమీప చెరువుల్లోకి మళ్లించి అక్కడి నుంచి ప్రత్యేక పైపుల ద్వారా నేరుగా పంట పొలాల్లోకి డ్రిప్‌‌‌‌‌‌‌‌ పద్ధతిలో నీరు వచ్చేలా పైలెట్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను రూపొందించి ప్రారంభించారు. కానీ నిర్వహణాలోపం కారణంగా పరికరాలు, పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌లు మూలకు పడ్డాయి. కూడవెల్లి ప్రాజక్ట్‌‌‌‌‌‌‌‌ వద్ద ఏర్పాటు చేసిన జోన్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌ పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌ చుట్టూ దట్టంగా చెట్లు పెరిగిపోవడమే కాకుండా, నీటిని పంపింగ్‌‌‌‌‌‌‌‌ చేసే పైపులు ద్వంసమయ్యాయి.

ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌ ఆపరేటింగ్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌తో నిర్ణీత సమయం పాటు పొలంలోకి డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా నీటిని విడుదల చేసే గేట్‌‌‌‌‌‌‌‌వాల్వ్‌‌‌‌‌‌‌‌లు విరిగిపోయాయి. డ్రిప్‌‌‌‌‌‌‌‌ కోసం పంపిణీ చేసిన పైపులు రోడ్ల వెంట, వ్యవసాయ పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ నిరుపయోగంగా కనిపిస్తున్నాయి. పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌లు పనిచేయకపోవడంతో రైతులు డ్రిప్‌‌‌‌‌‌‌‌ పరికరాలను తమ బోర్లను అనుసంధానం చేసుకుని వరి, మక్కజొన్న, కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. రెండు గ్రామాల్లో ప్రస్తుతం 10 శాతం లోపే రైతులు సాగు చేసుకుంటున్నా అది కూడా తమ సొంత బోర్లతోనే కావడం గమనార్హం.

రైతులకు అవగాహన కల్పించడంలో విఫలం

కేసీఆర్ దత్తత గ్రామాల్లో పైలెట్ ప్రాజక్ట్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించిన రెండేళ్లకే విఫలం కావడానికి లోపభూయిష్టమైన ప్రణాళికే కారణమని భావిస్తున్నారు. రెండు గ్రామాల్లో మొత్తం2,780 ఎకరాల వ్యవసాయ భూమి వుంటే సగానికి పైగా భూముల్లో రెండు సీజన్లలో రైతులు వరి సాగు చేస్తుంటారు. ఇది తెలిసినప్పటికీ వరి సాగు చేసే రైతులకు డ్రిప్‌‌‌‌‌‌‌‌, స్ర్పింక్లరను అందజేయడం వల్ల ఆశించిన ఫలితాలు రాలేదు.

వరికి బదులు డ్రిప్‌‌‌‌‌‌‌‌ విధానంలో పండే పంటలు సాగు చేసుకోవాలనే దిశగా రైతులకు అవగాహన కల్పించలేదు. 100 శాతం సబ్సిడీ వస్తోందని రైతులు డ్రిప్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. మరికొందరు ఆ పరికరాలను పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు కొందరు సొంత ప్రయోజనాల కోసం ప్రయత్నించడం వల్ల ఉమ్మడి జిల్లా హార్టికల్చర్‌‌‌‌‌‌‌‌ బడ్జెట్‌‌‌‌‌‌‌‌కు మూడింతలు ఎక్కువగా రెండు గ్రామాలకే ఖర్చు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ప్రతి 200 ఎకరాల్లో ఒకే రకమైన పంట

ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల్లోని 2,780 ఎకరాలను 14 జోన్లు, సబ్‌‌‌‌‌‌‌‌జోన్లుగా విభజించి వీటికి చైర్మన్లను నియమించారు. డ్రిప్‌‌‌‌‌‌‌‌ సాగుకు అవసరమైన పరికరాలను రైతులకు అందించారు. ప్రతి 200 ఎకరాల్లో ఒకే పంటను వేసి, పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌ల ద్వారా డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా పొలాల్లోకి నీరు వచ్చే ఏర్పాట్లు చేశారు. రెండు జోన్లకు అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌, హార్టికల్టర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌, వ్యవసాయ విస్తరణాధికారికి బాధ్యతలు అప్పగించడంతో పాటు ఒక్కో జోన్‌‌‌‌‌‌‌‌లోని 200 ఎకరాల్లో దుక్కి దున్నడంపై అవగాహన కల్పించారు. ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌ పంపింగ్‌‌‌‌‌‌‌‌ విధానాన్ని అమలు చేసినా  సరైన మ్యాన్‌‌‌‌‌‌‌‌పవర్‌‌‌‌‌‌‌‌ను నియమించకపోవడం, ఆరు తడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో పైలెట్ ప్రాజక్ట్‌‌‌‌‌‌‌‌పై ప్రభావం చూపింది. సరైన సమయంలో పంటలకు నీరందకపోవడంతో రైతులు పంట నష్టపోతామన్న ఉద్దేశంతో స్వంత ఏర్పాట్ల చేసుకోవడం వల్ల లక్ష్యం నీరుగారిపోయింది.

ఫోటోలో ఉన్న రైతు పేరు సైద శ్రీను. ఎర్రవల్లి గ్రామంలో తనకు ఉన్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమికి ఐదేండ్ల కింద అప్పటి ప్రభుత్వం ఉచితంగా డ్రిప్‌‌‌‌‌‌‌‌ సౌకర్యంతో పాటు, నీటి సరఫరాను సైతం కల్పించింది. మొదటి రెండేళ్లు బాగానే నడిచినా ఆ తర్వాత పర్యవేక్షణాలోపంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో రైతు శ్రీను తన పొలంలోని బోరుకు డ్రిప్‌‌‌‌‌‌‌‌ను అమర్చుకొని రెండు ఎకరాల్లో పత్తి, మరో అర ఎకరంలో వరి సాగు చేస్తున్నాడు.