పేదలంటే బీజేపీకి పడదు..బడా వ్యాపారులే వాళ్ల దోస్తులు: కేసీఆర్

  •    చేనేత కార్మికుల మీద జీఎస్టీ వేసిన ఫస్ట్ ప్రధాని మోదీనే
  •     నేత కార్మికులను మేము ఆదుకున్నం
  •     బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి కడుపు నింపినం
  •     బీజేపీకి ఓటేస్తే.. గోస పడ్తరు
  •     కరీంనగర్ రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ వ్యాఖ్య

రాజన్న సిరిసిల్ల, వెలుగు: బీజేపీ ఎజెండాలో పెద్ద పెద్ద వ్యాపారులు తప్ప పేదలు ఉండరని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. చేనేత కార్మికుల మీద జీఎస్టీ వేసిన మొదటి ప్రధాని మోదీనే అని విమర్శించారు. రెండు రోజుల కింద వేములవాడకు వచ్చిన మోదీ.. రాజన్న ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని ఎందుకు ప్రకటించలేదన్నారు. ధర్మం కోసం మాట్లాడే మోదీ దగ్గర బండి సంజయ్​కు రాజన్న ఆలయానికి ఇచ్చేందుకు ఒక్క రూపాయి కూడా దొరకలేదా? అని నిలదీశారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తరఫున శుక్రవారం సాయంత్రం సిరిసిల్లలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

‘‘దేశం, ధర్మం అంటూ మాట్లాడే బండి సంజయ్.. రాజన్న ఆలయం కోసం ప్రధానిని ఒక్క రూపాయి అడగలేదు. డెవలప్​మెంట్ కోసం ఆలయం పక్కనే 30 ఎకరాల స్థలం ఇప్పించా. తనను గెలిపిస్తే విదేశాల్లో ఉన్న నల్ల ధనం ఇండియాకు తీసుకొస్తానన్న మోదీ హామీ ఏమైంది? ఒక్కొక్కరి అకౌంట్​లో రూ.15లక్షలు వేస్తానని చెప్పి అందరిని మోదీ మోసం చేశారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, బేటీ బచావో.. బేటీ పడావో లాంటి మోదీ నినాదాలేవీ అమలు కాలేదు. ఇప్పుడు ‘అబ్ కీ బార్.. చార్ సౌ పార్’ అని అంటున్నరు. చార్ సౌ వస్తే.. పెట్రోల్ ధర రూ.200 దాటుతది. బీజేపీకి ఓటేసి మోసపోవద్దు. సిరిసిల్లకు టెక్స్​టైల్ పార్క్ అడిగితే ఇవ్వలేదు’’అని కేసీఆర్ అన్నారు. 

కాంగ్రెస్ హామీలేవీ నెరవేరలే

కాంగ్రెస్ ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదని కేసీఆర్ విమర్శించారు. ‘‘మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఎక్కడ? రైతుల రుణమాఫీ కాలే. ఆడ బిడ్డల పెండ్లికి తులం బంగారం ఇయ్యలే.. బస్ జర్నీ ఫ్రీ చేయడంతో మహిళలు తన్నుకునే పరిస్థితి వచ్చింది. రైతు బంధు ఇయ్యలే.. కరెంట్ కోత, నీటి గోస మొదలైంది. గోదావరి నీళ్లు తెచ్చి సిరిసిల్ల అప్పర్, మిడ్ మానేరు నింపిన. ఇప్పుడు పంటలు ఎందుకు ఎండాయో ఆలోచించాలి. సిరిసిల్ల నేత కార్మికుల ఉపాధి కోసం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చినం. కానీ.. కాంగ్రెస్ సర్కారేమో పాత బకాయిలే చెల్లిస్తలేదు. కొత్త ఆర్డర్లు ఇస్తలేదు. 

15 రోజుల కింద సిరిసిల్ల వచ్చినప్పుడు బతుకమ్మ చీరల బకాయిలు రూ.370 కోట్లు ఇవ్వాలని అడిగిన. కోపంలో ఒక మాట అంటే నా మీద ప్రచారం చేయకుండా నిషేధం విధించిన్రు. అందుకే యువత, రచయితలు, మేధావులు ఆలోచించి ఓటేయ్యాలి’’అని అన్నారు. వినోద్ కుమార్ చదువుకున్న వ్యక్తి అని, ఎంపీగా గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తారని అన్నారు. ‘‘బండి సంజయ్ మాట్లాడితే ఎవ్వనికన్నా అర్థమైతదా? ఆయనకు హిందీ, ఇంగ్లీష్ రాదు. వినోద్ న్యాయవాది. తెలివి కల్లోడు.. 2001 నుంచి తెలంగాణ సాధన కోసం నా వెంట ఉండి పని చేసిండు. వినోద్​ను భారీ మెజారిటీతో గెలిపించాలి. కరీంనగర్ బీఆర్ఎస్​కు గుండెకాయ లాంటిది’’అని కేసీఆర్ అన్నారు.