సిద్దిపేట, వెలుగు : బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలు నింపి పగలు పెంచుతుందే తప్ప దేశంలోని పేదల గురించి ఆలోచించే పార్టీ కాదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం రాత్రి సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. బీజేపీ ఎజెండాలో పేదల ఊసే ఉండదని, రైతులు, కార్మికులతో పాటు బడుగు బలహీన వర్గాల బాధలు బీజేపీకి పట్టవని విమర్శించారు. బీజేపీ పెట్టుబడి దారులు, కార్పొరేట్ వ్యాపారుల పార్టీయే తప్ప సామాన్యులది కాదన్నారు.
సిద్దిపేట జిల్లాను తీసేద్దామని మూర్ఖ ముఖ్యమంత్రి, ప్రభుత్వంఆలోచన చేస్తోందని తీద్దామంటే మనమంతా యుద్దం చేద్దామని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్ కోసం ఆలోచించి ఓటు వేయాలే తప్ప ఆగమాగం కావద్దని సూచించారు. తెలంగాణ ఉద్యమానికి ధైర్యాన్నిచ్చి అందలం ఎక్కిచ్చింది సిద్దిపేట గడ్డేనని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కులం మతం అనే తేడా లేకుండా అన్ని వర్గాలను కాపాడుకుంటూ ముందుకు పోయామని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ గా వెంకట్రామిరెడ్డి సిద్దిపేటను ఎంతో అభివృద్ధి చేశారని ఆయనను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ ను కోరినా ఇవ్వలదేని, తాను సీఎం అయిన తర్వాతనే సిద్దిపేట జిల్లా చేసుకున్నామని వివరించారు. కార్నర్ మీటింగ్ లో మాజీ మంత్రి హరీశ్ రావు ప్రసంగించగా ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర రెడ్డి తో పాటు ఫారుఖ్ హుస్సేన్, రసమయి బాలకిషన్, జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ పాల్గొన్నారు.