కాంగ్రెస్​ది తొండి సర్కారు: కేసీఆర్​

మెదక్/ నర్సాపూర్/ సంగారెడ్డి, వెలుగు: కాంగ్రెస్​ది తొండి సర్కార్​ అని, ఉచిత బస్సు స్కీం తప్ప ఏ గ్యారంటీని అమలు చేయలేదని బీఆర్ఎస్​ చీఫ్​ కేసీఆర్​ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ సర్కారు తలా, తోక లేకుండా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు.  ప్రతి ఎన్నికల్లో పాకిస్తాన్​ పేరు చెప్పి ఎమోషనల్​ బ్లాక్​ మెయిల్ చేయడం  ప్రధాని మోదీకి అలవాటైందని విమర్శించారు. జాడిచ్చి కొడితే 25 ఏండ్లు మనదిక్కు చూడని దేశాన్ని చూపించి.. ఓట్లు దండుకోవడం, మనకు గ్యాస్​ మాటలు చెప్పుడు ఆయనకు పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు.

 లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి మెదక్​ జిల్లా నర్సాపూర్, సంగారెడ్డి జిల్లా  పటాన్ చెరులో నిర్వహించిన రోడ్​షోలో కేసీఆర్ మాట్లాడారు. మోదీ ఎజెండాలో పేదల కష్టాలుండవని, ధనికుల బాధలు మాత్రమే ఉంటాయని చురకలంటించారు. అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్లకు రూ.15 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన మోదీ.. పబ్లిక్​ సెక్టార్​ కంపెనీలను పట్టించుకోలేదన్నారు.  సబ్​కా సాథ్​ సబ్​కా వికాస్​ అంటూ దేశాన్ని సత్తెనాశ్​ చేశారని అన్నారు. మోదీతో దేశానికి పైసా లాభం లేదని విమర్శించారు. ఆయన పాలనలో రూపాయి విలువ 84 పైసలకు పడిపోయిందని ధ్వజమెత్తారు 

ఆరెకరాల రైతులు ఏం పాపం చేశారు?

‘‘రాష్ట్ర సర్కారు వచ్చే సీజన్‌‌‌‌ నుంచి ఐదెకరాల వరకే రైతుబంధు వేస్తదట. ఆరు, -ఏడు ఎకరాల రైతులు ఏం పాపం చేశారు?’’ అని కేసీఆర్​ ప్రశ్నించారు. రేపు ఎవుసం చేస్తేనే రైతుబంధు ఇస్తామని అంటున్నారని, ఇంతకుముందు ఇట్లా వచ్చిందా? లేక అందరికీ వచ్చిందా? అని అడిగారు.  ‘రూ.2 లక్షల రుణమాఫీ జరగలేదు.. సాగు నీళ్లు లేవు.. కరెంట్​ సక్కగ వస్తలేదు.. భగీరథ మాయమైపోయింది.. స్టూడెంట్స్​కు రూ5 లక్షల కార్డు ఇయ్యలేదు.. వడ్లు కొంటలేరు.. బోనస్​ బోగస్​ అయ్యింది.. పేదల సంక్షేమం లేనే లేదు.. తొండి సర్కార్​ ఇది.. ఐదు నెలలకే ఇంత ఆగమైంది’ అని వ్యాఖ్యానించారు.

 కరెంట్​ సమస్యతో హైదరాబాద్​నుంచి పరిశ్రమలు వెళ్లి పోతున్నాయని, ఐటీ రంగం దెబ్బతినే పరిస్థితి ఉందన్నారు. అందరం కలిసి యుద్ధం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం సాగుకు నీళ్లిచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దేవుళ్ల మీద ఒట్లు పెట్టడం.. కేసీఆర్ ను తిట్టడం సీఎం రేవంత్​కు పరిపాటిగా మారిందన్నారు. కాళేశ్వరం కాలువల పనులు జరిగి.. గోదావరి జలాలు పొలాలకు పారాలంటే కాంగ్రెస్​ మెడలు వంచాలని కేసీఆర్​అన్నారు. పార్లమెంట్​ఎన్నికల్లో మెదక్​ ఎంపీగా వెంకట్రామిరెడ్డిని గెలిపిస్తేనే  మల్లన్నసాగర్​ నీళ్లొచ్చి నర్సాపూర్​ బంగారు తునక అవుతుందని చెప్పారు. 

పార్లమెంట్​లో బీఆర్ఎస్​ఎంపీలు ఎక్కువ మంది ఉంటే పులిబిడ్డల్లాగా కొట్లాడుతారన్నారు. ‘‘పటాన్​చెరు ప్రాంతంలో పోలీసులు ఓవరాక్షన్​​ చేస్తూ బీఆర్ఎస్​ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. పోలీసుల్లారా జాగ్రత్త.. మళ్లీ వచ్చేది తెలంగాణ ప్రభుత్వమే.  అతిగా పోకుండా మీ డ్యూటీ మీరు చేసుకోండి” అని కేసీఆర్​ హెచ్చరించారు.