ఎస్పీఎం కంపెనీ, లారీ ఓనర్స్ .. సమస్యల పరిష్కారానికి కమిటీ

  • ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే నేతృత్వంలో ఏర్పాటు 
  • రాష్ట్ర పరిశ్రమల డైరెక్టర్ ఉత్తర్వులు 

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ లోని ఎస్పీఎం పేపర్ కంపెనీ, స్థానిక లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఆసిఫాబాద్ కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఇందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి. మల్సూర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెల రోజులుగా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ సమ్మె చేస్తోంది. 

కలెక్టర్, సబ్ కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేదు. లారీ ఓనర్స్ అసోసియేషన్, ఎస్పీఎం మేనేజ్ మెంట్ మొండిగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఎస్పీఎం కంపెనీ తమకు ముడి సరుకు రవాణాలో తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందని సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నవించింది. దీంతో మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో  కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

 చైర్మన్ గా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, మెంబర్లుగా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, రాష్ట్ర పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ సురేశ్, జిల్లా ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ రామ్ చందర్, వరంగల్ లేబర్ జాయింట్ కమిషనర్ రాజేంద్ర ప్రసాద్, కాగజ్ నగర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కేవీఎస్ రామ్మోహన్ తో పాటు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మదిరే అశోక్ మెంబర్ కన్వీనర్ గా నియమించారు. కమిటీ వెంటనే ఎస్పీఎం కంపెనీ, లారీ ఓనర్స్ అసోసియేషన్ తో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.