సాక్షుల వద్దకే జడ్జి

  • నడవలేని స్థితిలో ఆటోలో కూర్చున్న వారి వద్దకు వచ్చి వివరాలు నమోదు 

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా కోర్టు సముదాయంలో బుధవారం పీసీఆర్ న్యాయమూర్తి టి.దుర్గారాణి విభిన్న పద్ధతిలో సాక్షులను విచారించారు. నడవలేని స్థితిలో ఉన్న సాక్షుల వద్దకు వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. ఇచ్చోడ మండలం జామిడికి చెందిన మునేశ్వర్ రాంబాయి, భగత్ సులోచన  2017లో తలమడుగు పోలీస్ స్టేషన్​లో కే.ఉషన్న, అయిండ్ల సక్కుబాయిపై ఓ ఘటన విషయంలో ఫిర్యాదు చేశారు.

విచారణలో భాగంగా బాధితుల సాక్ష్యం నమోదు చేయాల్సి ఉంది. వారు అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్నారు. వారిని తలమడుగు పోలీస్ స్టేషన్ సీడీఓ సంతోష్ ఆటోలో కోర్టుకు తీసుకొచ్చారు. వారు కోర్టు లోపలికి రాలేని పరిస్థితి ఉండడంతో న్యాయమూర్తి  దుర్గారాణి..  బాధితులు ఉన్న ఆటో వద్దకు వచ్చి ఏపీపీ నవీన్, న్యాయవాది అమరేందర్ రెడ్డి సమక్షంలో సాక్ష్యాలు నమోదు చేసుకున్నారు. జిల్లా కోర్టు చరిత్రలోనే ఇలా సాక్ష్యం నమోదు చేయడం మొదటిసారని న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పేర్కొన్నారు.