అదిలాబాద్ టౌన్/ బోథ్/ నిర్మల్/చెన్నూర్, వెలుగు: సినీనటుడు మోహన్ బాబు జర్నలిస్ట్ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని జర్నలిస్ట్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో జర్నలిస్ట్‌పై దాడికి నిరసనగా బుధవారం పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్‌క్లబ్ నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి ఎన్టీఆర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. మీడియా ప్రతినిధిపై దాడి చేసిన మోహన్ బాబుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని కోరుతూ బోథ్ మండల కేంద్రంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు సూది నరేశ్ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. జేఏసీ నాయకులు దేవేందర్, బేత రమేశ్, సురేశ్, దేవీదాస్, నాయకులు కార్తీక్, మల్లేశ్, పురుషోత్తం, రమణ గౌడ్, సంతోష్, ఎర్రన్న, షేక్ అలీ, వంశీ, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలి
నిర్మల్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. స్థానిక ప్రెస్ క్లబ్ నుంచి ఆర్డీవో ఆఫీస్ వరకు ర్యాలీగా చేరుకొని నినాదాలు చేశారు. మోహన్‌బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. చెన్నూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక అంబే ద్కర్ చౌరస్తాలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మోహన్ బాబు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం పట్టణ సీఐ, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసి చర్యలు తీసుకోవాలని కోరారు.