ఆదిలాబాద్, వెలుగు: రాజకీయ పార్టీలు, నాయకులకు వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంగా వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై కొందరు నాయకులు బెదిరింపులు, భౌతిక దాడులు చేస్తున్నారని, ఇలాంటి చర్యలను అరికట్టాలని జర్నలిస్ట్ జేఏసీ నాయకులు ఎస్పీ గౌస్ ఆలంను కోరారు. ఈ మేరకు బుధవారం ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు.
ఇప్పటికే ఆదిలా బాద్ జిల్లాలోని పలువురు జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని, తాజాగా టీవీ ఛానెల్ రిపోర్టర్ పై కాంగ్రెస్ నియోజక వర్గ ఇన్చార్జి బెదిరింపులకు పాల్పడ్డారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటివారిపై చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్ట్ జేఏసీ కన్వీనర్ నూకల దేవేందర్, కో కన్వీనర్ బీర్కూర్వార్ వెంకటేశ్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్స్, కెమెరామెన్స్ తదితరులు పాల్గొన్నారు.