తప్పుల్లేకుండా ఓటరు జాబితా రూపొందించాలి : కె.సురేంద్ర మోహన్

  • 18 ఏండ్లు నిండిన వారంతా ఓటు నమోదు చేసుకోవాలి
  • ఉమ్మడి జిల్లా ఓటరు జాబితా పరిశీలకుడు కె.సురేంద్ర మోహన్

మంచిర్యాల/ఆసిఫాబాద్, వెలుగు: ఓటరు లిస్టులో ఎలాంటి తప్పులు దొర్లకుండా స్పష్టమైన జాబితా రూపొందించాలని ఉమ్మడి జిల్లా ఓటరు జాబితా పరిశీలకుడు కె.సురేంద్ర మోహన్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆసిఫాబాద్, మంచిర్యాల​కలెక్టరేట్లతో జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లు వెంకటేశ్ ధోత్రే కుమార్​దీపక్, అడిషనల్ కలెక్టర్లు, ఇతర అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో రివ్యూ నిర్వహించారు. ఓటరు జాబితాలో రెండు, మూడు ఎపిక్ కార్డులు కలిగిన, అడ్రస్​ మారిన, మరణించిన వారి వివరాల మార్పులు, సవరణలు, తొలగింపులపై దృష్టి సారించాల న్నారు.

 కుటుంబ సభ్యులందరి ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చేలా జాబితా రూపొందించాలని సూచించారు. డిగ్రీ కాలేజీల్లో క్యాంపస్ అంబాసిడర్లను నియమించి వారి ద్వారా ఓటరు నమోదుపై ప్రచారం చేయాలని సూచించారు. 18 ఏండ్లు నిండిన వారంతా ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ముసాయిదా జాబితాపై ఫిర్యాదులు, అభ్యంతరాలకు ఈ నెల 28 వరకు గడువుందని, వాటిని డిసెంబర్ 24 లోపు పరిష్కరిస్తామని, జనవరి 6న ఫైనల్​ లిస్టు పబ్లిష్​చేస్తామని మంచిర్యాల కలెక్టర్​ తెలిపారు. జిల్లాలో ముసాయిదా లిస్టు ప్రకారం 3,23,278 మంది పురుషులు, 3,29,924 మంది మహిళలు, 45 మంది ఇతరులు, 39 మంది ఎన్ఆర్ఐలు, 684 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని తెలిపారు.