ఆదిలాబాద్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

చైనా మాంజా చుట్టుకుని ఒకరికి గాయాలు 

ఖానాపూర్, వెలుగు :  నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో చైనా మాంజా మెడకు చుట్టుకుని ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.  ఖానాపూర్  పట్టణం విద్యానగర్ కాలనీకి చెందిన పరిమి చంద్ర విలాస్ తన ఇంటి  నుంచి బైక్‌పై  గోదావరి వైపు సోమవారం సాయంత్రం వెళ్తున్నాడు.  స్థానిక మసీదు ముందుకు రాగానే ఆయన మెడకు చైనా మాంజా చుట్టుకుని గొంతు కోసుకుపోయింది.  దీంతో విలాస్ వాహనం పై నుంచి కిందకు పడిపోయాడు.  అతని మెడ నుంచి రక్తం అధికంగా పోవడంతో  వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  కడెం మండలం మాసాయిపేట గ్రామానికి చెందిన ఎర్రన్న అనే వ్యక్తి  చేయికి కూడా ఓ పతంగికి ఉన్న చైనా మాంజా బిగుసుకొని స్వల్ప గాయమైంది. 

పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి 

లక్షెట్టిపేట, వెలుగు:  అంగన్వాడీల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించి సమస్యలను పరిష్కరించాలని సోమవారం సీడీపీఓ రేష్మ కి అంగన్‌ వాడీ యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ..  అంగన్వాడీ ఉద్యోగులు ప్రతి రోజు జీపీఎస్ ద్వారా ఫొటోలు పెట్టాలనడం సరికాదన్నారు. 

మౌలిక వసతులు కల్పించండి

జైపూర్, వెలుగు:  శ్రీరాంపూర్ డివిజన్ లోని ఇందారం ఓపెన్ కాస్ట్ ప్రభావిత గ్రామమైన టేకుమట్లలో మౌలిక వసతులు కల్పించాలని గ్రామానికి చెందిన పలువురు నాయకులు సోమవారం శ్రీరాంపూర్ ఏరియా జీఎం సూర్యనారాయణను కలిసి కోరారు.  ఇందారం -టేకుమట్ల శివారులోని సింగరేణి స్థలంలో క్రీడా మైదానంతో పాటు ఓపెన్ జిమ్ , సీసీరోడ్లు, బోర్‌‌వెల్స్ లైటింగ్ సౌకర్యాలు కల్పించాలని వినతి పత్రం అందజేశారు. 

దరఖాస్తుల స్వీకరణ

ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పొరుగు సేవల పద్ధతిన 52 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే   ఒక ప్రకటనలో తెలిపారు.  ప్రభుత్వ వైద్య కళాశాలలో 15 ల్యాబ్ అటెండెంట్, 7 డాటా ఎంట్రీ ఆపరేటర్తో సహా వివిధ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.  

సైకిల్ పోలో చాంపియన్ షిప్ కు ఆశ్రమ స్కూల్ విద్యార్థి  

తిర్యాణి, వెలుగు: తిర్యాణి ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థి కర్పెత నాగేశ్వర్ జాతీయ స్థాయి సైకిల్ పోలో చాంపియన్ షిప్‌కు ఎంపికైనట్లు స్కూల్ హెడ్మాస్టర్  కె.శంకర్ సోమవారం తెలిపారు.  రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన నాగేశ్వర్ ఈ నెల 11 నుంచి 15  వరకు వెస్ట్ బెంగాల్‌లో జరగనున్న  జాతీయ స్థాయి సైకిల్ పోలో ఛాంపియన్ షిప్ పోటీలకు సెలెక్ట్ అయ్యారు.  డీడీటీడబ్ల్యూ రమాదేవి, డీఎస్వో మీనారెడ్డి, ఏసీఎంవో  ఉద్దవ్, ఏటీడీవో చిరంజీవితో పాటు స్కూల్ సిబ్బంది అభినందించారు.

ప్రహరీ నిర్మించాలి 

మంచిర్యాల, వెలుగు:  మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనంలో నిర్వహిస్తున్న ఎస్సీ బాలికల హాస్టల్ లో వెంటనే ప్రహరీ నిర్మించాలని యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి తెలిపారు.  సోమవారం కలెక్టర్ కు బాలికల వసతి గృహానికి సంబంధించిన వినతిపత్రం యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం  అందించారు. అనంతరం తిరుపతి మాట్లాడుతూ..  ఎస్సీ బాలికల వసతి గృహానికి ప్రహరీ కొన్ని రోజుల నుంచి లేకపోవడం వల్ల విద్యార్థినులు  అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారన్నారు. 

ఎస్టీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి

నేరడిగొండ , వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేక ఎస్టీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని లంబాడీల ఐక్యవేదిక సభ్యులు డిమాండ్ చేశారు . నేరడిగొండ మండలంలోని రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు సోమవారం  వినతి పత్రం అందజేశారు.  గిరిజన విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.  మండల లైవ్ కోఆర్డినేటర్ రాథోడ్ సందీప్, రాథోడ్ గులాబ్ సింగ్ , రాథోడ్ సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు .

బొగ్గు ఉత్పత్తి టార్గెట్‌కు చర్యలు 

కోల్​బెల్ట్​, వెలుగు:  సింగరేణి సంస్థ నిర్దేశించిన వార్షిక ఉత్పత్తి 72 మిలియన్​ టన్నుల టార్గెట్​ను సాధించేలా అందరు కృషి చేయాలని, ఉత్పత్తితో పాటు అదే స్థాయిలో బొగ్గు రవాణా ఉండేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి డైరెక్టర్​(ప్లానింగ్​అండ్​ ప్రాజెక్ట్​) జి.వెంకటేశ్వర్​రెడ్డి అన్నారు.  సోమవారం సాయంత్రం ఆయన మందమర్రి ఏరియా కేకే ఓపెన్​కాస్ట్​ గని బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత తీరును తనిఖీ చేశారు. రవాణా వివరాలను గని ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు.