ఇది సమతుల్య బడ్జెట్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • ఆత్మనిర్భర్​ భారత్ నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్ ఉందని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ అన్ని వర్గాలకు మేలు చేసేలా సమతుల్య బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆత్మనిర్భర్​ భారత్ నిర్మాణమే లక్ష్యంగా మోదీ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి ప్రోత్సాహకాలు ఇచ్చిందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి ట్యాక్స్ సేవింగ్స్ ప్రకటించిందని గుర్తుచేశారు. 

‘సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్’లో భాగంగా -పేదలను శక్తివంతం చేయడం, అన్నదాత ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాలు బడ్జెట్‌లో ప్రతిబింబించాయన్నారు. ఇందులో భాగంగా పట్టణాల్లోని కోటి పేద, మధ్యతరగతి కుటుంబాల గృహ అవసరాలను తీర్చడానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడిని కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదించడం సంతోషంగా ఉందన్నారు.