రూ.2.26 కోట్లు రికవరీ అయ్యేనా.!

  •     మళ్లీ తెరపైకి కోనాపూర్​ సొసైటీ  స్కాం 
  •     చర్యలకు డీసీసీబీ జనరల్ బాడీలో తీర్మానం 

మెదక్, రామాయంపేట, వెలుగు: రామాయంపేట మండలం కొనాపూర్ పీఏసీఎస్​(సొసైటీ)లో రూ.2.26 కోట్లు దుర్వినియోగం అయిన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.  ఈ సొసైటీ చైర్మన్​ బీఆర్ఎస్​మెదక్​ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి భర్త ఎం.దేవేందర్​ రెడ్డి కావడంతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. మూడేళ్ల కిందటే భారీ ఎత్తున నిధులు దుర్వినియోగం అయినట్టు ఎంక్వైరీలో తేలినప్పటికీ బీఆర్ఎస్​ అధికారంలో ఉండడం వల్ల ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. 

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ ఓడిపోయి కాంగ్రెస్​అధికారంలోకి రాగా కోనాపూర్​ సొసైటీలో జరిగిన అక్రమాలపై దృష్టి పెట్టింది. ఇటీవల దేవేందర్​రెడ్డిని సొసైటీ డైరెక్టర్​ పదవి నుంచి డిస్​క్వాలిఫై చేస్తూ కో ఆపరేటివ్​ డిపార్ట్​మెంట్ నిర్ణయం తీసుకోగా తదనుగుణంగా డీసీసీబీ డైరెక్టర్​ పదవి నుంచి అతడిని తప్పించడంతోపాటు, దుర్వినియోగమైన రూ.2.26 కోట్లు రికవరీ చేయాలని డీసీసీబీ జనరల్​ బాడీ మీటింగ్​లో ఏకగ్రీవ తీర్మానం చేశారు.   కోనాపూర్​ సొసైటీలో మొత్తం 697 మంది రైతులు మెంబర్లు ఉండగా  సొసైటీకి పెట్రోల్ బంక్​, ఫర్టిలైజెర్ షాప్, షాపింగ్​ కాంప్లెక్స్​, గోడౌన్​ ఉన్నాయి. 

ట్రోల్​, డీజిల్​, ఎరువులు, విత్తనాల విక్రయాలు, షాప్​ల కిరాయి, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా కమీషన్​ రూపంలో పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతోంది.  ఆయా బిజినెస్​ల ద్వారా వచ్చే ఇన్​కం, ఎక్ప్సెండిచర్​లకు సంబంధించి లెక్కల్లో తేడాలున్నాయని, నిబంధనలకు విరుద్దంగా లక్షల్లో పేమెంట్స్​ జరిగాయని, సొసైటీ ఫండ్స్​ విషయంలో పెద్ద మొత్తంలో గోల్​మాల్​ జరిగిందని పలువురు డైరెక్టర్లు 2020లో  డిస్ట్రిక్ట్​ కోఆపరేటివ్​ ఆఫీసర్​కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సొసైటీ లెక్కలకు సంబంధించిన నివేదిక  ఇవ్వాలని సీఈవో గోపాల్​రెడ్డికి రెండుసార్లు నోటీస్​లు ఇచ్చినప్పటికీ అతడి నుంచి రిప్లే రాకపోగా సొసైటీ మీటింగ్​లో డైరెక్టర్లు చేసిన తీర్మానం మేరకు అతడిని సీఈవోగా తొలగించారు.

సెక్షన్​ 51 కింద ఎంక్వైరీ

డైరెక్టర్ల ఫిర్యాదు నేపథ్యంలో కోనాపూర్​ సొసైటీ ఫండ్స్​ విషయంలో వచ్చిన ఆరోపణలపై కోఆపరేటివ్​ డిపార్ట్​మెంట్​ఆఫీసర్లు కోఆపరేటివ్ యాక్ట్​ 1964 సెక్షన్​-51 కింద ఎంక్వైరీ చేశారు. ఇందులో 2015 నుంచి 2020 వరకు వివిధ రూపాల్లో మొత్తం రూ.2,26,98,70  దుర్వినియోగం అయినట్టు గుర్తించారు.  ఫండ్స్​ మిస్​ యూస్​లో చాలా వాటికి సీఈవో గోపాల్​ రెడ్డిని బాధ్యులుగా చూపగా కొన్నింటికి సీఈఓతోపాటు సొసైటీ  చైర్మన్​ దేవేందర్​రెడ్డిని బాధ్యులుగా పేర్కొన్నారు.  దుర్వినియోగం అయిన సొసైటీ ఫండ్స్​ను సంబంధిత వ్యక్తుల నుంచి ఏడాదికి 21 శాతం ఇంట్రెస్ట్​తో రికవరీ చేయాలని ఎంక్వైరీ రిపోర్ట్​లో పేర్కొన్నారు.  

చైర్మన్​, సీఈవోలకు నోటీసులు

కోనాపూర్ సొసైటీలో దుర్వినియోగమైన రూ.2.26 కోట్లు రికవరీ కాలేదు. దీనిపై జిల్లా కో ఆపరేటివ్ అధికారులు చైర్మన్ దేవేందర్ రెడ్డి తో పాటు సీఈవో గోపాల్ రెడ్డికి ఈనెల 8న  సర్ ఛార్జ్ నోటీసులు అందజేశారు. ఈనెల 28 న సొసైటీ చైర్మన్​తో పాటు  సీఈవో ను,  29న సొసైటీ  డైరెక్టర్లను  హియరింగ్ కు హాజరు కావాలని డీసీవో ఆదేశాలు జారీచేశారు.
‌‌‌‌ - మల్లారెడ్డి, కోనాపూర్​ సొసైటీ సీఈవో