అక్రమాలకు కేరాఫ్ గా సొసైటీలు

  • టేక్మాల్, ఇబ్రహీంపూర్​ పీఏసీఎస్​లలో రూ.లక్షల్లో గోల్ మాల్​
  • ఆదాయ, వ్యయాలకు  లెక్కాపత్రం లేదు
  • మెదక్ ​ఆర్డీవో ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంక్వైరీ

మెదక్, టేక్మాల్, వెలుగు : జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (సొసైటీ) అక్రమాలకు నిలయంగా మారాయి. సహకార శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ  కరువవడంతో సొసైటీ  చైర్మన్లు, సీఈవోలది 'ఆడింది ఆట పాడింది పాట' అన్నట్టుగా తయారైంది. ఆదాయ, వ్యవయాలకు లెక్కా పత్రం లేకుండా పోతోంది. ఎరువుల విక్రయాలు, గన్నీ బ్యాగులు

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా సమకూరే కమీషన్​ డబ్బులు, పెట్రోల్ బంక్ ల నిర్వహణ, భూముల రిజిస్ట్రేషన్ లలో లక్షల్లో గోల్ మాల్ జరుగుతోంది. ఇదివరకు రామాయంపేట మండలం కొనాపూర్ సొసైటీలో రూ.2.26 కోట్లు దుర్వినియోగం కాగా.. ఇప్పుడు టేక్మాల్, చేగుంట మండలం ఇబ్రహీంపూర్ సొసైటీలో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. 

టేక్మాల్ ​సొసైటీలో..

టేక్మాల్ సొసైటీ అభివృద్ధి కోసం చిలకమర్రి కుటుంబీకులు గతంలో 2.12 ఎకరాలు  దానం చేశారు. కాగా ఆ భూమిని సొసైటీ పేర రిజిస్ట్రేషన్ చేయించలేదు.  సదరు భూమి రికార్డుల్లో వారసుల పేర ఉండడంతో  వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు, గ్రామస్తులు జోక్యం చేసుకుని వారసులను ఒప్పించి రూ.3 లక్షలకు సెటిల్ మెంట్ చేసి గిఫ్ట్​ డీడ్​గా సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 

ఈ మేరకు 2018లో సదరు 2.12  ఎకరాల భూమి టేక్మాల్​సొసైటీ సీఈవో పేరు మీద రిజిస్టర్ అయింది. అయితే భూ యజమానులకు రూ.3 లక్షలు చెల్లించగా రిజిస్టర్​డాక్యుమెంట్​లో  రూ.27.84 లక్షలకు భూమి కొనుగోలు చేసినట్టు ఉండటం గమనార్హం. సొసైటీ నుంచి తమకు రూ.3 లక్షలు మాత్రమే ఇచ్చారని భూమి యజమానులు చెబుతుండగా రూ.27.84 లక్షలకు కొన్నట్టు చూపడంతో పెద్ద ఎత్తున డబ్బులు దుర్వినియోగమైనట్టు తెలుస్తోంది. 

సొసైటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ధనూరలో 2020లో ఏర్పాటు చేసిన పెట్రోల్​బంక్ వ్యవహారంలో సైతం అవకతవకలు జరిగినట్టు తెలిసింది. బంక్​ ఏర్పాటు కోసం అవసరమైన భూమిని 25 సంవత్సరాలకు లీజుకు తీసుకుని నెలకు రూ.10 వేల అద్దె చెల్లించినట్టు సమాచారం. కేవలం ఆరు నెలలు మాత్రమే నడిపి నష్టం వస్తోందని బంద్​ చేశారు. పెట్రోల్​బంక్​ లో రూ.13 లక్షలు నష్టం వచ్చినట్టు చూపిస్తున్నారు.  

ఇబ్రహీంపూర్ లో..

చేగుంట మండలం ఇబ్రహీంపూర్​ సొసైటీలో సైతం లక్షల రూపాయల దుర్వినియోగం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎరువులకు సంబంధించి రూ.14 లక్షలు పక్కదారి పట్టగా, దాదాపు రూ.25 లక్షల విలువైన గన్నీ బ్యాగులు గోల్​మాల్​అయినట్టు సమాచారం. పాలకవర్గ సభ్యులు దావత్​లు చేసుకున్నపుడల్లా అందుకు అయిన  ఖర్చు సొసైటీ ఖాతాలో రాసినట్టు ఆరోపణలున్నాయి. అంతేగాక కొన్నాళ్ల కింద సొసైటీ సభ్యులు తొమ్మిది మంది సొసైటీ డబ్బులతోనే గోవా టూర్​కు వెళ్లినట్టు తెలిసింది. రైతులకు మంజూరు చేసిక క్రాప్​లోన్ల విషయంలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎంక్వైరీ నడుస్తోంది

టేక్మాల్, ఇబ్రహీంపూర్​సొసైటీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు మాకు ఫిర్యాదులు అందాయి. టేక్మాల్​ సొసైటీలో భూమి కొనుగోలు వ్యవహారంలో,  పెట్రోల్​బంక్​ కు సంబంధించి లక్షల్లో మిస్​యూస్​అయినట్టు తెలిసింది. రూ.24 లక్షలు అనామత్​ ఖర్చుల కింద రాసినట్టు ఆడిట్​ లో గుర్తించాం. మెదక్ ఆర్డీవో ఆధ్వర్యంలో టేక్మాల్​ సొసైటీ అక్రమాలపై ఎంక్వైరీ నడుస్తోంది. ఇబ్రహీంపూర్ సొసైటీలో అక్రమాలు జరిగినట్టు ఫిర్యాదు రాగా అసిస్టెంట్​రిజిస్ట్రార్ ఫయాజ్​అహ్మద్​ను ఎంక్వైరీ ఆఫీసర్​గా నియమించాం. 

ఆ సొసైటీలో ఎరువులకు, గన్నీ బ్యాగులకు సంబంధించి సుమారు రూ.40 లక్షల వరకు దుర్వినియోగం అయినట్టు ప్రాథమికంగా గుర్తించాం. ఆయా సొసైటీల్లో జరిగిన అక్రమాలు, అవకతవకల్లో చైర్మన్​, సీఈవోలు ఇద్దరి పాత్ర ఉంది. సొసైటీ అక్రమాలపై కలెక్టర్​ప్రత్యేక దృష్టిపెట్టారు. సమగ్ర దర్యాప్తు జరిపి అక్రమాలకు పాల్పడ్డవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.​ 

- కరుణ, డిస్ట్రిక్ట్​ కో ఆపరేటివ్ ఆఫీసర్​