- పెద్ద చెరువు, రామసానికుంట, సిద్ధమ్మ కుంట, మల్లన్న గారి కుంట, గంగవానికుంటలు కబ్జా
- ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు
- ఆరుట్ల శివారులో కబ్జాల పర్వం
సంగారెడ్డి, వెలుగు : ఆక్రమణదారులు చెరువులు, కుంటలను చెరబడుతున్నారు. ఎఫ్ టి ఎల్ ప్రాంతాలు కబ్జాలకు గురవుతుండగా చెరువులు, కుంటల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. సంగారెడ్డికి కూతవేటు దూరంలో ఉన్న కంది మండలం ఆరుట్ల గ్రామంలో ఈ కబ్జాల పర్వం కొనసాగుతుంది. గత బీఆర్ఎస్ హయాంలో ఆక్రమణకు గురైన చెరువులు, కుంటల్లో ప్రస్తుతం దర్జాగా వెంచర్లు వెలుస్తున్నాయి. ఓ కుంట శిఖం భూమిలో ప్లాట్లు చేసి ఇల్లు నిర్మించుకోగా వాటికి పంచాయతీ అధికారులు ఇంటి నెంబర్లు ఇవ్వడం
మరో కుంటను లోకల్ లీడర్లు వ్యవసాయం పేరుతో ఆక్రమించుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరుట్ల గ్రామ శివారులో పెద్ద చెరువు, రామసానికుంట, మల్లన్న గారి కుంట, సిద్ధమ్మ కుంట, గంగవాని కుంట కబ్జాకు గురయ్యాయి. కబ్జాలపై గతంలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఆ మధ్య సర్వే చేపట్టారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
రూ. 20 కోట్ల భూమి స్వాహాయత్నం
ఆరుట్ల గ్రామ శివారులో సర్వే నెంబర్ 159లో 112.20 ఎకరాల్లో పెద్ద చెరువు విస్తరించి ఉంది. ఇందులో 92.20 ఎకరాలు పట్టా భూములు ఉన్నట్టు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. చెరువులో నీళ్లు లేని టైంలో మాత్రమే ఆ భూముల్లో పట్టాదారులు సాగు చేసుకోవాల్సిఉంటుంది. కానీ కొందరు ఆ భూముల్లో మట్టి, మొరం పోసి ప్లాట్లుగా మార్చారు. పైగా ఇది తమ స్థలమే అంటూ హద్దురాళ్లు పాతారు. ఈ భూమిని ప్లాట్లుగా మార్చి అమాయక ప్రజలకు విక్రయిస్తున్నారు. చెరువు శిఖం భూమిని ప్లాట్లుగా మార్చిన లోకల్ లీడర్లు వాటిని అమ్మి రూ.20 కోట్ల వరకు వెనకేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఆరుట్ల గ్రామ పరిధిలో ఉన్న సిద్ధమ్మ కుంట, మల్లం గారి కుంట, గంగవానికుంట ఆక్రమణకు గురికాగా ఇప్పటికే కొంతమేరకు అమ్మేశారు. సర్వేనెంబర్ 31 లోని సిద్ధమ్మ కుంట 14.31 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో సుమారు 4 ఎకరాల స్థలాన్ని కొందరు కబ్జా చేసి చెరువు శిఖం భూమిని ప్లాట్లుగా విభజించి గజం ధర.12 వేల చొప్పున విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఎకరం భూమి విలువ రెండు కోట్ల వరకు ఉంటుంది. సర్వే నెంబర్ 484లో గంగవానికుంట 7.4 ఎకరాల్లో విస్తరించి ఉండగా, ఇందులో రెండున్నర ఎకరాలు ఆక్రమణకు గురైంది.
ఈ కుంట స్థలంలో అక్రమంగా ఇంటి నెంబర్లు పొంది తాత్కాలిక ఇండ్లు కూడా నిర్మించుకున్నారు. రామసాని కుంట 16.15 ఎకరాల్లో ఉండగా, దాదాపు 6 ఎకరాల శిఖం భూమి కబ్జాకు గురైంది. ఇక్కడ ఎకరం భూమి సుమారు 1.50 కోట్లు పలుకుతోంది. మల్లం గారి కుంట సర్వే నెంబర్ 467లో 17 ఎకరాల్లో విస్తరించి ఉంది. అయితే ఓ పొలిటికల్ లీడర్ దీన్ని పట్టా భూమిగా మార్చి కబ్జా చేశాడు. కుంటలో మొరంపోసి నింపేశాడు.
ఆ తర్వాత ఫ్లాట్లుగా మార్చి అక్కడ కొన్ని తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి ఇంటి నెంబర్లు కూడా పొందారు. జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి కబ్జాకు గురైన చెరువులు, కుంటలను స్వాధీనం చేసుకొని భూములను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.