నెట్వర్క్, వెలుగు: అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పలువురు వయోవృద్ధులను శాలువాలు, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. ఆదిలాబాద్‌లోని జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ రాజర్షి షా పాల్గొని మాట్లాడారు. వయోవృద్ధుల చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాల న్నారు.
వయోవృద్ధులకు సంబంధించిన సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్ 14567కు తెలియజేయాలన్నారు. ఆర్డీవో వినోద్ కుమార్, డీబ్ల్యూవో సబిత, డీఆర్డీవో సాయన్న, వయోవృద్దుల జిల్లా సమైఖ్య అద్యక్షుడు దేవిదాస్ దేశ్ పాండే పాల్గొన్నారు. వయోవృద్ధులతో గౌరవంగా మెలగాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిష నల్ కలెక్టర్ దాసరి వేణు, వయోవృద్ధుల సంక్షేమ సంఘం ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
వయోవృద్ధుల సంక్షేమం, పోషణ పట్ల నిర్లక్ష్యం వహించిన కుటుంబసభ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంచిర్యాల కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా సంక్షేమశాఖ అధికారి స్వరూపా రాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి అనిత, వయోవృద్ధుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు చేసి నిరంతరం కుటుంబ సంక్షేమాన్ని ఆకాంక్షించే వృద్ధుల పోషణను బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. వయో వృద్ధుల సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని నిర్మల్అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వృద్ధులను సత్కరించారు.