ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీసీలకు నష్టం : ఇంటలెక్చువల్ ఫోరం

నిర్మల్, వెలుగు: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీసీ, ఎస్సీ ఎస్టీలకు తీవ్ర నష్టం జరుగుతోందని ఇంటలెక్చువల్స్ ఫోరం ఆరోపించింది. ‘ఈడబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు సమంజసమేనా’ అనే అంశంపై నిర్మల్​లోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో ఆదివారం చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటలెక్చువల్స్ ఫోరం బాధ్యుడు దర్శనం దేవేందర్ మాట్లాడుతూ.. దేశ జనాభాలో 90 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ హక్కులను తుంగలో తొక్కి, జనాభాలో  కేవలం 7 శాతం కూడా లేని  ఓసీలకు ఆర్థిక వెనుకబాటును సాకుగా చూపి 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయడంపై మండిపడ్డారు. 

ఈ  రిజర్వేషన్ల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు, నిరుద్యోగులు ఎన్నో ఉద్యోగ, విద్య అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలయ్యేవరకు ఉద్యమించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై త్వరలో అన్ని గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.  టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు వెలుమల ప్రభాకర్, వివిధ సంఘాల నాయకులు జుట్టు గజేందర్, జె.లక్ష్మణ్, కటకం మురళి, శంకర్, మారపాక భీమయ్య, లక్ష్మణ్, రాజలింగం,రమణ గౌడ్, మహీంద్రాచారి, సాయన్న తదితరులు 

పాల్గొన్నారు.